13మంది అగ్నివీర్‌కు ఎంపిక
చీపురుపల్లి: రన్‌మిషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 13 మంది యువకులు ఒకేసారి అగ్నివీర్ జవాన్లుగా ఎంపికయ్యారు. పట్టణానికి చెందిన కంది హేమంత్ అనే ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి రన్‌మిషన్ స్థాపించి గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. రన్‌మిషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రతిరోజూ శరీరదారుఢ్యంలో శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు పరీక్షలకు సంబంధించిన సూచనలు, పుస్తకాలు కూడా ఇస్తున్నారు. రన్‌మిషన్ నేతృత్వంలో గతంలో కూడా ఎంతో మంది యువత సీఐఎస్‌ఎఫ్, కానిస్టేబుల్, ఆర్మీ, ఐటీబీపీ వ్యవస్థల్లో ఉద్యోగాలు సాధించారు. తాజాగా 13 మంది యువత అగ్నివీర్‌కు ఎంపికయ్యారు. హేమంత్ సెలవు రోజుల్లో యువతకు శిక్షణ ఇస్తుండగా ఆయన విధి నిర్వహణలో ఉన్న సమయంలో అసిస్టెంట్ కోచ్ నవీన్ యువతకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు. తాజాగా అగ్నివీర్‌కు ఎంపికై న యువతను రన్‌మిషన్ ఆధ్వర్యంలో ఆదివారం సత్కరించారు.
ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
● పరీక్షకు 97.92 శాతం హాజరు
విజయనగరం అర్బన్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) ప్రతిభా పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 3 డివిజన్ల పరిధిలో 19 పరీక్షా కేంద్రాల్లో 4,094 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 97.92 శాతంతో 4,009 మంది హాజరయ్యారు. పట్టణంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లోని పరీక్ష కేంద్రంలో పరీక్ష నిర్వహణను డీఈఓ యూ.మాణిక్యం నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని సాఫీగా నిర్వహించామని తెలిపారు.
మూడు షాపుల్లో చోరీ
రాజాం సిటీ: పట్టణ నడిబొడ్డున తిరుమలనగర్‌లో ఆదివారం వేకువజామున రెండు సెల్‌సాయింట్లు, టైలరింగ్ షాపుల్లో దొంగతనం జరిగింది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం యథావిధిగా దుకాణాలకు వచ్చిన యజమానులు తాళాలు విరగ్గొట్టి ఉండడాన్ని చూసి ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. ఒక సెల్‌పాయింట్‌లో ఉంచిన ముప్పావు తులం బంగారంతో పాటు, రూ.10వేలు, మరో సెల్‌పాయింట్‌లో రూ.15వేలు అపహరణకు గురయ్యాయని బాధితులు పోలీసులు వద్ద వాపోయారు. అలాగే టైలరింగ్ షాపులో ఏమీ దొరకపోవడంతో బట్టలు చిందరవందరగా పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీపీ ఫుటేజీ పరిశీలించిన అనంతరం క్లూస్‌టీమ్‌కు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపారు.
ఆలయంలో చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
బొబ్బిలి: మండలంలోని పిరిడి గ్రామంలోని శాంకరిమాత ధ్యానమందిరంలో పుస్తెలతాడు,శతమానాలు దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం నవంబరు 5న శాంకరిమాత ధ్యానమందిరంలో భక్తులుగా ధ్యానం చేస్తున్నట్లు నటించి అక్కడే ఉన్న బంగారు పుస్తెల తాడు, శతమానాలను దొంగిలించారు. ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులైన సీతానగరం మండలానికి చెందిన పోల భాస్కర్రావు, శ్రీకాకుళం జిల్లా హిరమండలానికి చెందిన సవర సూర్యంలను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం అంగీకరించారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. వారిద్దరూ గతంలో సీతానగరం మండలంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలోను వెండివస్తువుల దొంగతనానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని,జిల్లాలో పలు దొంగతనాల్లో వారి పాత్ర ఉందని తెలియజేశారు.
13మంది అగ్నివీర్‌కు ఎంపిక
13మంది అగ్నివీర్‌కు ఎంపిక


