నెల్లిమర్ల టు విజయవాడ
● దుర్గమ్మ దర్శనానికి మూడోసారి సైకిల్ యాత్ర
నెల్లిమర్ల రూరల్: భక్తి, దీక్ష, సంకల్ప బలానికి ప్రతీకగా నిలుస్తూ నెల్లిమర్ల మండలంలోని ఒమ్మి, అలుగోలు గ్రామాలకు చెందిన భవానీ భక్తులు మూడోసారి సైకిల్ యాత్రకు పయనమయ్యారు. ఒమ్మి గ్రామంలో అమ్మవారి నామస్మరణతో, భక్తి నినాదాల నడుమ ఈ యాత్ర ప్రారంభమైంది. 41 రోజుల పాటు భవాని అమ్మవారి దీక్షను నిష్టగా నిర్వర్తించిన భక్తులు అంబళ్ల అప్పలనాయుడు, కోరాడ గోవర్ధన్‌లు గురుస్వామి నారాయణరావు ఆధ్వర్యంలో ఇరుముడి ధరించి సైకిళ్లపై విజయవాడకు బయలుదేరారు. ఇప్పటికే రెండు సార్లు సైకిల్‌పై వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నామని, సుమారు 480 కిలోమీటర్లు యాత్రను మూడు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. లోక కల్యాణార్థం..హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఏటా ఈ సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో గురుస్వాములు కురిమినేని నారాయణరావు, అంబళ్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు.


