వృద్ధుడి అదృశ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 75 ఏళ్ల వృద్ధుడు కనిపించడం లేదని పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. వృద్ధుడు లెక్కల అప్పారావు గత నెల 29వ తేదీన చెల్లూరు సమీపంలో ఉన్న ఇంటి నుంచి వెళ్లిపోయాడని కొడుకు రామకృష్ణ ఫిర్యాదు చేశాడు. అదే రోజు ఉదయం 10.15గంటలకు ఇంటి నుంచి సమీప షాపుకు వవెళ్లిన అప్పారావు మధ్యాహ్నం 1గంట అయినా ఇంటికి రాలేదు. అప్పటి నుంచి స్థానికులతో పాటు చుట్టు పక్కల వారిని వాకబు చేసినప్పటికీ అప్పారావు జాడ తెలియరాలేదు. తన తండ్రి అప్పారావు కనిపించలేదంటూ కొడుకు రామకృష్ణ ఫిర్యాదు చేశాడని కేసు కట్టి నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై అశోక్ తెలిపారు.
బస్సు, బైక్ ఢీకొని ద్విచక్రవాహనదారు మృతి
సీతానగరం: మండలంలోని ప్రధాన రహదారిపై గుచ్చిమి వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.విజయనగరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పార్వతీపురం నుంచి సీతానగరం మీదుగా విజయనగరం వస్తుండగా సీతానగరం నుంచి పార్వతీపురం మధ్యలో బస్సు గుచ్చిమి బస్టాప్ వద్ద ఆగింది.ఆగి ఉన్న బస్సును మోటార్ సైకిలిస్ట్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదం జరిగిందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏఎస్సై లక్ష్మణరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని గుర్తించడానికి మోటార్‌సైకిల్‌లో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తించలేకపోయామని తెలియజేశారు. హోండాషైన్ మోటార్ సైకిల్ (ఎపి35ఎసి2190 నంబర్) బస్సు ఫ్రంట్‌వీలును చుట్టుకోవడంతో బైక్ నుజ్జునుజ్జు అయింది. ఈ వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని కోరారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
గజపతినగరం: గంట్యాడ మండలం బుడతనాపల్లి గ్రామానికి చెందిన కొర్నాన అప్పలనాయుడు(30) అనే వ్యక్తి గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామ సమీపంలో విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టి మృతిచెందినట్లు ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మట్లాడుతూ కొర్నాన అప్పలనాయుడు గజపతినగరం మండలం పురిటి పెంట గ్రామ సమీపంలో ఇసుక లోడు పట్టిన అనంతరం ట్రాక్టర్ పైకి ఎక్కి ఇసుకను సర్దుతుండగా దగ్గరలో ఉన్న విద్యుత్ వైర్లు తగిలి గురువారం రాత్రి చనిపోయినట్లు మృతుడి తండ్రి మల్లయ్య చెప్పాడన్నారు.ఈ విషయంపై శుక్రవారం మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.
వృద్ధుడి అదృశ్యం


