క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరచాలి
● జేఎన్‌టీయూ, గురజాడ వర్సిటీ వీసీ సుబ్బారావు
డెంకాడ: ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకూ కాకినాడ జేఎన్‌టీయూలో జరగబోయే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొనే జేఎన్‌టీయూ, విజయనగరం గురజాడ విశ్వవిద్యాలయం జట్టు ఉత్తమ ప్రతిభ కనబరచాలని వీసీ వీవీ సుబ్బారావు అన్నారు. ఈ పోటీల్లో గురజాడ విశ్వవిద్యాలయం తరఫున ఆడబోయే వాలీబాల్ పురుషుల జట్టు, ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ కమ్ యూనివర్సిటీ వాలీబాల్ పురుషుల జట్టు ఎంపిక పోటీలను చింతలవలసలోని ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం వీసీ వీవీ సుబ్బారావు రిబ్బన్‌కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక పోటీల్లో విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల జట్ల క్రీడాకారులు మెరుగైన ఆటతీరును ప్రదర్శించాలన్నారు. క్రీడలతో శారీరక, మానసిక వికాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైఎంసీ శేఖర్, టోర్నమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ, పీడీ రామచంద్రరాజు, క్రీడా సమన్వయకర్త జి.అప్పలనాయుడు, పరిశీలకులు కె.నాగరాజు, పీడీలు, కోచ్‌లు, రిఫరీలు,కళాశాల డీన్‌లు, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అంతర్ వర్సిటీ క్రీడాపోటీలకు మిమ్స్ విద్యార్థి
నెల్లిమర్ల: సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయ టేబుల్ టెన్నిస్ పోటీలకు మిమ్స్ హోమియోపతి కళాశాల సెకండియర్ విద్యార్థి కళ్యాణి ఎంపికై నట్లు ఆ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె.కళావెంకటరావు ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. నవంబర్ 21న ఏలూరులోని ఆశ్రం మెడికల్ కళాశాలలో జరిగిన ఎంపిక పోటీల్లో సదరు విద్యార్థి ప్రతిభ కనబరిచి, పై స్థాయి పోటీలకు అర్హత సాధించిందన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు విశాఖ గీతం యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ మేరకు సదరు విద్యార్థిని మిమ్స్ చైర్మన్ అల్లూరి సత్యనారాయణరాజు, మేనేజింగ్ ట్రస్ట్ ప్రవీన్ వర్మ, లైఫ్ ట్రస్ట్ శ్రీ రామకృష్ణరాజు, డీన్ లక్ష్మికుమార్, మిమ్స్ డైరెక్టర్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ శ్రీధర్ తదితరులు అభినందించారు.


