రెచ్చిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు
నెల్లిమర్ల రూరల్: మండలంలో కొంతకాలంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు రెచ్చిపోతున్నారు. పొలాల్లోని రైతుల వ్యవసాయ మోటార్లకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు ఎత్తుకు పోతున్నారు. దొంగల స్వైర విహారంతో రైతులు హడలిపోతూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వ్యవహారంపై విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.చోరీ సమయంలో విద్యుత్ ప్రమాదం జరిగితే తమకు సంబంధం లేదనే ప్రకటనలు ఇస్తున్నారే తప్ప తమ సంస్థకు దొంగల వల్ల జరుగుతున్న నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మండలంలోని సతివాడ, మధుపాడ గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని కాపర్ వైర్లను ఎత్తుకుపోయారు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ ధర సుమారు రూ.3లక్షల వరకు ఉంటుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. చోరీపై బాధిత ఏఈకి ఫిర్యాదు చేసి మూడు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం అందించలేదని బాధిత రైతులు తెలియజేస్తున్నారు. ఇప్పటికై నా విద్యుత్, పోలీస్ అధికారులు చోరీలపై నిఘా ఉంచి నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.
రెండు గ్రామాల్లో నాలుగు చోట్ల చోరీ


