ఎంఓయూలతో విద్యార్థులకు మేలు
విజయనగరం రూరల్: విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి వివిధ సంస్థలతో కుదుర్చుకుంటున్న ఎంఓయూలతో విద్యార్థులకే మేలు అని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వీవీ సుబ్బారావు అన్నారు. జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం, హైదరాబాద్‌లోని టార్చ్ ఫిన్‌టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఉపకులపతి సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఒప్పందంతో వర్సిటీ విద్యార్థులకు పరిశ్రమ ఆధారిత నైపుణ్యాలు, స్వయం కోర్సులు, స్కిల్ ఎసెస్‌మెంట్ ప్రొగ్రాంలు అందించడం జరుగుతుందన్నారు. ఈ ఒప్పందం విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికి, స్టార్టప్ సంస్కృతి పెంపొందించేందుకు, పరిశ్రమ–విశ్వవిద్యాలయ అనుసంధానానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, టార్చ్ ఫిన్‌టెక్ ఎండీ వైభవ్ తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం, కోరుకొండ రైల్వేస్టేషన్ ల మధ్య రైలు పట్టాలపై సుమారు 50నుంచి 55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని విజయనగరం రైల్వే పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం కోరుకొండ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ పై సుమారు 5 అడుగుల 3 అంగుళాల పొడవు కలిగి, ఎరుపు రంగు ఛాయతో, పసుపు రంగుపై ఎరుపు, తెలుపు రంగు చిన్న గడుల చీర, ఎరుపు రంగు జాకెట్ ధరించి ఉన్న మహిళ మృతదేహాన్ని కనుగొన్నామని తెలిపారు. మృతురాలి కుడి చేతిపై ఒడిశా భాషలో పచ్చబొట్టు గుర్తు ఉందన్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9490617089,94419 62879 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై బాలాజీ రావు కోరారు.


