పరజపాడుగదబవలసలో ఏనుగుల తిష్ఠ
జియ్యమ్మవలస రూరల్: పంట చేతికి అందికొస్తున్న సమయంలో అటవీ ఏనుగులు గుంపు ఈ మండలానికి వచ్చి రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ విషయమై కూటమి నాయకులంతా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏనుగులను తరలించాలని గగ్గోలు పెట్టారు. ఎన్నికల సమయంలో కుంకీ ఏనుగులను తెప్పించి ఈ ప్రాంతం నుంచి అటవీ ఏనుగుల గుంపును తరలిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం కిక్కురుమనకుండా చోద్యం చూస్తున్నారు.మరోవైపు ఏనుగులను తరలించాలని గట్టిగా నిలదీస్తే కేసుపెడతారేమోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో జియ్యమ్మవలస మండలంలో గడిచిన ఐదు రోజులుగా ఏనుగులు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నాశనం చేస్తూ నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాయి. గురువారం చింతల బెలగాం పరిసరాల్లో రైతుల ధాన్యం బస్తాలను పాడుచేసి శుక్రవారం పరజపాడు గదబవలసలో తిష్ఠ వేశాయి. దీంతో కళ్లాల్లో ధాన్యం, చెరుకు పంటలను నాశనం చేస్తూ ప్రాణహాని కలిగిస్తాయన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఏనుగుల గుంపును తరలించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


