బీఏ నారాయణకు ఘంటసాల స్మారక పురస్కారం
విజయ
నగరం: ఘంటసాల జయంతిని పురస్కరించుకుని ఈనెల 5వ తేదీన ప్రముఖ సంగీత విద్వాంసుడు బీఏ నారాయణకు ఘంటసాల స్మారక పురస్కారం ప్రదానం చేయనున్నామని ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకుడు సముద్రాల గురుప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజున సీతం కాలేజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ గాయనీ గాయకులు ఉమామహేశ్వరి,కూర్మారావు,సూర్య ప్రకాష్, నీలిమా రాణి, గిరిజాప్రసన్న తదితరులు తమ పాటలతో అలరిస్తారని పేర్కొన్నారు.
అట్రాసిటీ కేసులో ఇద్దరు ముద్దాయిలకు జైలుశిక్ష
విజయనగరం క్రైమ్: జిల్లాలోని సంతకవిటి పోలీస్‌స్టేషన్‌లో 2020లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిలైన సంతకవిటి మండలం గోళ్లవలసకు చెందిన వెంపటాపు గోపి (35), కొప్పల రామినాయుడు (50)లకు శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ కోర్టు కం 4వ అదనపు జిల్లా సెషనన్స్ జడ్జి, ఎస్.ఎం.ఫణికుమార్ నాలుగున్నరేళ్ల జైలు శిక్ష, రూ.12,000లు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ ఏఆర్.దామోదర్ బుధవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. సంతకవిటి మండలంలోని గోళ్లవలస గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల ఆడిట్ జరుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన ఫిర్యాదు దారు చింతాడ అసిరయ్య (40)ను అదే గ్రామానికి చెందిన వెంపటాపు గోపి, కొప్పల రామినాయుడు కులం పేరుతో దూషించి, కర్రతోను, చేతులతో దాడి చేసి గాయ పరిచినట్లు సంతకవిటి పోలీస్ స్టేషన్‌లో 6.2.2020న బాధితుడు ఫిర్యాదు చేయగా సంతకవిటి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ కేసుపై, అప్పటి ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎ.సత్యనారాయణ దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితులపై నేరం రుజువు కావడంతో శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ కోర్టు కం 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, ఎస్.ఎం.ఫణికుమార్ పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.


