అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
● సర్టిఫికెట్ల మంజూరులో ఆలస్యం చేయొద్దు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చే ప్రభుత్వ లక్ష్యం నేపథ్యంలో వారి పేర్లను నమోదు చేసుకునే అవకాశం ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి సూచించారు. ఈ నెల 14 వరకూ ఇళ్ల స్థలాలకు దరఖాస్తుల నమోదుకు గడువు ఉన్నందున ప్రజలకు ఈ సమాచారం చేరేలా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లస్థలాల మంజూరుకు గ్రామాలవారీగా ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలాలు, ఇంకా అవసరమయ్యే భూముల వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని ఆదేశించారు. మ్యుటేషన్‌లు, రెవెన్యూ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు, ప్రజలకు కావాల్సిన సర్టిఫికెట్లను తక్షణమే మంజూరు చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ సివిల్ సప్‌లైస్ విభాగానికి సంబంధించిన రైస్ కార్డుల పెండింగ్ కేసులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. నిర్ణయించిన అజెండా అంశాలపై తాజా సమాచారంతో ప్రతి అధికారి తప్పనిసరిగా సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జరిగిన సమీక్షలో గోనెసంచులు, జీపీఎస్‌తో కూడిన వాహనాలు సిద్ధంగా ఉన్నాయని రెండు రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు కూడా పూర్తి అవుతాయని కలెక్టర్ తెలిపారు. బీజీలు రాని మిల్లర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని దళారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వివిధ శాఖలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ డివిజన్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి, వ్యవసాయ శాఖ జేడీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి సివిల్ సప్‌లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.


