చికిత్స పొందుతూ వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడి మృతి
రామభద్రపురం: మండలంలోని బూసాయవలస జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై గత నెల 28వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మామిడివలస మాజీ సర్పంచ్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతనెల 28వ తేదీన మామిడివలస గ్రామానికి చెందిన మండల సన్యాసిరావు (56) పనినిమిత్తం మామిడివలస నుంచి రామభద్రపురం వెళ్లి పని ముంగించుకుని తిరిగి తన గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్లిపోతుండగా బూసాయవలస జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో విజయనగరం నుంచి ఒడిశా వెళ్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో సన్యాసిరావు తలకు తీవ్ర గాయమవడంతో కుటుంబసభ్యులు, స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
సన్యాసిరావు మృతి పార్టీకి తీరని లోటు
మామిడివలస గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీనియర్ వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు మండల సన్యాసిరావు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడన్న సమాచారం తెలుసున్న మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, జెడ్పీటీసీ అప్పికొండ సరస్వతి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పిచారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్యక్రమంలో మామిడవలస సర్పంచ్ మూడడ్ల అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు చింతల సింహాచలం నాయుడు, మండల యూత్ అధ్యక్షుడు పత్తిగుళ్ల ఏక్‌నాథ్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు డర్రు పైడిరాజు పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడి మృతి


