జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఇందు
చీపురుపల్లి: జాతీయస్థాయిలో జరిగిన టెన్నికాయిట్ చాంపియన్ షిప్‌లో చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని కిలారి ఇందు సత్తా చాటింది. జాతీయ స్థాయిలో జరిగిన చాంపియన్‌షిప్‌లో చక్కని ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది. దీంతో బుధవారం పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బంగారు పతకం సాధించిన ఇందును పాఠశాల హెచ్‌ఎం ఎల్.తిరుపతిరావు, కోచ్ ఎం.రామారావు అభినందించారు. ఈ సందర్భంగా కోచ్ రామారావు మాట్లాడుతూ నవంబర్ 26 నుంచి 30 వరకు జమ్ము కాశ్మీర్‌లో జరిగిన 42వ జాతీయ టెన్నికాయిట్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయని ఈ పోటీల్లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఇందు పాల్గొన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొనగా అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఇద్దరిలో పెదనడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కిలారి ఇందు ఒకరని తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగిన చాంపియన్‌షిప్ పోటీల్లో చక్కని ప్రతిభ కనపరిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చిన ఇందును ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని హెచ్‌ఎం తిరుపతిరావు పిలుపునిచ్చారు.
టెన్నికాయిట్‌లో బంగారు పతకం


