నీతి కథలే వ్యక్తిత్వానికి పునాది
● అలరించిన విద్యార్థుల కోలాటం
● ఘనంగా 9వ రోజు పుస్తక మహోత్సవం
పార్వతీపురం రూరల్: పిల్లలకు బాల్యం నుంచే నీతి కథలు వినిపించడం ద్వారా వారిలో దేశభక్తి, వినయం, సమయస్ఫూర్తి వంటి సద్గుణాలను పెంపొందించి, ఉత్తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దవచ్చని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక పురిపండా అప్పలస్వామి ప్రాంగణంలో బుధవారం 9వ రోజు పుస్తక మహోత్సవ సాహిత్య సభ కళారత్న డా.డి.పారినాయుడు అధ్యక్షతన జరిగింది. బాలసాహితీవేత్తలకు పార్వతీపురం నిలయంగా మారిందని ఈ సందర్భంగా పారినాయుడు కొనియాడారు. కార్యక్రమంలో బెహరా ఉమామహేశ్వరరావు రచించిన ‘చెట్లు చెప్పిన కథలు’ నవలను ఆవిష్కరించారు. పర్యావరణ ఆవశ్యకతను ఈ పుస్తకం అద్భుతంగా వివరిస్తోందని సమీక్షకుడు పక్కి రవీంద్రనాథ్ పేర్కొన్నారు. కాగా, ఎన్.ములగ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రతిభను ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో బెలగాం భీమేశ్వరరావు, తుంబలి శివాజీ, బీవీ పట్నాయక్, ఈదుబిల్లి ఉషారాణి, గొట్టాపు శ్రీనివాసరావు తదితర కవులు తమ కవితా గానంతో అలరించారు.


