వైభవంగా హనుమద్ వ్రతం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో హనుమద్ వ్రతం బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. వేకువజామున ఆలయంలో ప్రాతఃకాలార్చన, బాలభోగం అనంతరం యాగశాలలో సుందరకాండ హోమం నిర్వహించారు. అనంతరం వెండి మంటపంలోని ఉత్సవ మూర్తులకు నిత్య కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ప్రతి ఏటా మార్గశిర మాస శుద్ధ త్రయోదశి భరణి నక్షత్రం రోజున జరుపుకునే హనుమాన్ వ్రతం ఈ సారి మరింత భక్తి ప్రపత్తులతో సాగింది. ఆంజనేయస్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అర్చకులు విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం తమలపాకులు, సిందూరంతో సహస్రనామర్చన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


