‘కూటమి’ నిర్లక్ష్యం!
బక్కచిక్కిన బోధన
ప్రభుత్వానికి నివేదిక పంపించాం
ఇంటర్ విద్యపై
పార్వతీపురం రూరల్: ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. మరో మూడు నెలల్లో విద్యార్థులు కీలకమైన వార్షిక పరీక్షలకు సిద్ధం కావాల్సిన తరుణమిది. కానీ, జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి మాత్రం అంతా గందరగోళం.. అయోమయం అన్నట్టుగా ఉంది. కళాశాలల్లో తిష్ట వేసిన సమస్యలు విద్యార్థుల భవితకు గాలం వేస్తున్నాయి. మౌలిక వసతుల మాట దేవుడెరుగు.. కనీసం పాఠాలు చెప్పేందుకు సరిపడా లెక్చరర్లు, పరిపాలన నడిపేందుకు సిబ్బంది లేక కళాశాలలు కునారిల్లుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా.. ఇంటర్ విద్యపై నిర్లక్ష్యం వీడటం లేదు. దీంతో ఉన్న వారిపై పని భారం, విద్యార్థులకు పాఠాల భారం తప్పడం లేదు.
ఆ పోస్టులు అలంకారప్రాయమే..!
క్రీడలకు, విజ్ఞానానికి ప్రతీకగా ఉండాల్సిన ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లైబ్రేరియన్ పోస్టులు చాలా కళాశాలల్లో అలంకారప్రాయంగా మారాయి. పార్వతీపురం, పాలకొండ బాలురు కళాశాలల్లో మాత్రమే పీడీలు పని చేస్తున్నారు. బలిజిపేట, కొమరాడ, పార్వతీపురం, పాలకొండ (బాలురు), సాలూరులోని ఐదు కళాశాలల్లో మాత్రమే రెగ్యులర్ లైబ్రేరియన్లు ఉన్నారు. మిగిలిన తొమ్మిది కళాశాలల్లో ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరో ఒక లెక్చరరే అదనపు బాధ్యతగా వీటిని చూడాల్సి వస్తుండటంతో.. అటు బోధనకు, ఇటు లైబ్రరీ సేవలకు న్యాయం జరగడం లేదు.
అక్కడ.. ఆ సబ్జెక్టులు చెప్పేవారేరీ?
పరీక్షలు సమీపిస్తున్న వేళ.. పలు కళాశాలల్లో కీలక సబ్జెక్టులకు అధ్యాపకులే లేరు. ప్రధానమైన సబ్జెక్టులకు బోధకులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు ట్యూషన్లపై ఆధారపడలేని పేద విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బోధన సిబ్బంది సంగతి అలా ఉంచితే.. కళాశాల పరిపాలన నడపాల్సిన బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ ఊసే లేదు. జిల్లాలోని ఏ ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ సూపరింటెండెంట్, క్లాస్–4 ఉద్యోగులు లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్లు ఒక్కో కళాశాలకు ముగ్గురు ఉండాలి, కానీ గుమ్మలక్ష్మీపురంలో ఒక్కరే పని చేస్తున్నారు. అలాగే రికార్డ్ అసిస్టెంట్లు 37 మందికిగాను కేవలం 16 మందే విధుల్లో ఉన్నారు. టైపిస్టులు ఆరు చోట్ల పోస్టులు మంజూరైనా.. పార్వతీపురంలో మాత్రమే ఒకరు పని చేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్లు 14 కళాశాలలకుగాను ఆరు చోట్లే ఉన్నారు. మిగిలిన ఎనిమిది కళాశాలల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ విద్యకు పునాది వంటిది. అలాంటి కీలకమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ కళాశాలలను గాలికొదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షల షెడ్యూల్ విడుదలైన తరుణంలోనైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి, ఖాళీ పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటం మానుకోవాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు.
జిల్లా పరిధిలో సీతంపేట, గరుగుబిల్లి మినహా 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలన్నీ అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి. మొత్తం 140 మంది కాంట్రాక్టు ఫ్యాకల్టీ (సీఎఫ్), 12 మంది గెస్ట్ ఫ్యాకల్టీ, ఒక ఎంటీఎస్ లెక్చరర్‌తో విద్యార్థులకు బోధన సాగుతోంది. రెగ్యులర్ లెక్చరర్లు కేవలం 27 మందే ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. అంటే మొత్తం భారం కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లపైనే పడుతోంది. అయినా ఇంకా 12 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కరువైంది. వారి సేవలను గుర్తిస్తున్న దాఖలాలు కూడా లేవు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ఈ సమస్య తీవ్రతను రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదించడం జరిగింది. పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తాయని ఆశిస్తున్నాం. ఆదేశాలు అందిన వెంటనే ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. – వై.నాగేశ్వరరావు,
జిల్లా కళాశాల విద్యా అధికారి
‘కూటమి’ నిర్లక్ష్యం!


