ఉద్యోగులకు జీతాల్లేవ్!
● ఐదో తేదీ వచ్చినా ఖాతాల్లో జమకాని వైనం
● ఇబ్బందులు పడుతున్న చిరు, మధ్యతరగతి వేతన జీవులు
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు పడడం గగనమైంది. ఈ నెల ఐదో తేదీ వచ్చినా చాలా విభాగాల ఉద్యోగులకు జీతం మొత్తం జమకాలేదు. చేస్తుంది సర్కారు కొలువే గానీ.. నెలయ్యే సరికి ఒక భరోసా లభించడం లేదని పలువురు వాపోతున్నారు. పేరుకు రూ.వేలల్లో జీతం అయినా అధిక శాతం మంది మధ్య తరగతి ఉద్యోగులకు ఒకటో తేదీ వస్తే గుండె దడే. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పాలవాడు, కిరాణా వంటివే కాక.. ఈఎంఐలు, తీసుకున్న రుణాలకు చెల్లింపులు కచ్చితమైన తేదీకి కట్టాల్సిందే. ఈఎంఐలు, రుణాలు మొత్తం చెల్లించకుంటే వారి ఖాతా మైనస్ బ్యాలెన్స్‌లోకి వెళ్లిపోతుంది. ఇవన్నీ పోనూ.. చేతిలో మిగిలింది రూపాయలే. ఒకటో తేదీన జీతం కోసం సగటు ప్రభుత్వ ఉద్యోగి ఎదురు చూస్తుంటాడు. ఈ నెల ఇంతవరకూ జమ చేయకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వేలాది మంది ఎదురు చూపు
జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 12,500 మంది, ఉపాధ్యాయులు 9,700 మంది, పోలీసులు 900 మంది వరకూ ఉన్నారు. వీరు కాక.. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు వందల సంఖ్యలో పని చేస్తున్నారు. ఉపాధ్యాయులు, పోలీసులు, వైద్య శాఖ సిబ్బందికి రెండు రోజుల కిందట జీతం మొత్తం చెల్లింపులు చేశారు. మిగిలిన చాలా వరకూ ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఐదో తేదీ వచ్చినా జమ కాలేదు. ఒక్కొక్కరికీ ఒక్కో తేదీన ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. దీంతో వారంతా ఎప్పటికప్పుడు తమ బ్యాంకు ఖాతా మొత్తాన్ని పరిశీలించుకుంటున్నారు. ఒకటో తేదీ నాటికి జీతాలు జమచేస్తే.. ఉద్యోగులు తమ నెలవారీ అవసరాలను తీర్చుకుంటారు. దీనికితోడు గత నెల వరుస పండగలు రావడంతో ఖర్చులు పెరిగాయని.. అప్పులు చేయాల్సి వచ్చిందని పలువురు చెబుతున్నారు. ఈ నెలలో పిల్లలకు సెకెండ్ టర్మ్ ఫీజులు కూడా చెల్లించాలని అంటున్నారు. ఇప్పటికే డీఏ చెల్లింపుల్లో కోత వేసిన ప్రభుత్వం.. సమయానికి జీతాలు కూడా చెల్లించడం లేదని వాపోతున్నారు.


