వైద్య సేవలపై కేంద్ర బృందం ఆరా
వీరఘట్టం: కేంద్ర వైద్య బృందం సభ్యులు వీరఘట్టం పీహెచ్‌సీని బుధవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై వైద్యాధికారి బి.ప్రదీప్‌ను అడిగి తెలుసుకున్నారు. ఓపీ నమోదు, వైద్యపరీక్షలు, అందజేస్తున్న మందులు, రిఫరల్ కేసులు తదితర అంశాలపై ఆరా తీశారు. వైద్యుల బృందం దీపికాశర్మ, యడ్ల రమణ, నీరజ్, అనీల్ వెంట డీఎంహెచ్‌ఓ భాస్కరరావు, గొర్లె నాగభూషణరావు తదితరులు ఉన్నారు. వీరఘట్టం పీహెచ్‌సీని సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేయాలని స్థానికులు కేంద్ర వైద్య బందానికి విన్నవించారు.
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
విజయనగరం రూరల్: జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 6న నిర్వహించనున్నట్టు జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతనెల 29న నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశం మోంథా తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం ఉద యం 11 గంటలకు జరగనున్న సమావేశానికి సభ్యులందరూ హాజరుకావాలని కోరారు.
ఇద్దరు విద్యార్థులకు పచ్చకామెర్లు
సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత ఆశ్రమపాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు పచ్చకామెర్ల లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఏడో తరగతి చదువుతున్న కిల్లాడకు చెందిన మండంగి గౌతమ్, దంజుపాయికి చెందిన కూరంగి వరుణ్ నీరసంగా ఉండడంతో సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు రక్తపరీక్షలు చేసి పచ్చకామెర్ల లక్షణాలు ఉన్నట్టు గుర్తించి, శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నట్టు హెచ్‌ఎం చంద్రరావు తెలిపారు.
సీ్త్రనిధి రుణ మంజూరు లక్ష్యం రూ.86 కోట్లు
గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో సీ్త్ర నిధి రుణాల మంజూరు లక్ష్యం రూ.86 కోట్లని డీఆర్‌డీఏ హెచ్‌ఆర్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్ వి.ధర్మారావు, ఏజీఎం పి.కామరాజు అన్నారు. గుమ్మలక్ష్మీపురంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో సీసీలతో బుధవారం సమావేశమయ్యారు. ఎస్‌హెచ్‌జీల స్వయం అభివృద్ధికి అందజేస్తున్న రుణాలు, వాటి రికవరీపై సమీక్షించారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 2,575 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.41.5 కోట్లను సీ్త్ర నిధి నుంచి రుణాల రూపంలో అందజేశామన్నారు. 93 శాతం రికవరీ జరుగుతోందని తెలిపారు. ఇదివరకు ఒక ఎస్‌హెచ్‌జీకి రూ.5 లక్షలు మాత్రమే సీ్త్ర నిధి ద్వారా రుణాలు ఇచ్చేవారమని, ఇకపై ఒక ఎస్‌హెచ్‌జీకీ రూ.8లక్షల వరకు సీ్త్ర నిధి రుణాలు ఇస్తామని చెప్పారు. సీ్త్ర నిధితో పాటు ఇతర రుణాలు పొందిన సభ్యులు ప్రతినెలా 10వ తేదీలోగా ఆయా ఖాతాల్లో వాయిదా నగదును జమచేస్తే వడ్డీ పడదన్నారు.
భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు జరిపారు. డీఎస్పీ ఎన్.రమ్య, ఇద్దరు సీఐలు, సిబ్బంది కలిసి కార్యాలయం తలుపులు మూసేసి ఉదయం 11.30 నుంచి రాత్రి 7 గంటల వరకు రికా ర్డులు తనిఖీ చేశారు. రోజువారీ రిజిష్ట్రేషన్లు, నెలలో జరిగే రిజిస్ట్రేషన్ల సంఖ్య, ప్రభుత్వానికి రోజుకి వస్తున్న ఆదాయం తదితర వివరాలపై ఆరా తీసినట్టు సమాచారం.
ఏసీబీ అధికారులు వచ్చే సమయానికి పది నిమిషాల ముందు సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ కార్యా లయం నుంచి బయటకు వెళ్లి పోయారు. సీనియర్ అసిస్టెంట్ అనంతలక్ష్మి ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చినట్టు తెలిసింది. సబ్ రిజిస్ట్రార్ తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఎవరికంట పడకుండా ఆటోలో కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోదాలు చేస్తున్నామని, గురువారం కూడా తనిఖీలు చేస్తామని, అందుకే కార్యాలయాన్ని సీజ్ చేసినట్టు డీఎస్పీ రమ్య మీడియాకు తెలిపారు.


