కన్నపేగులను కాపాడి తల్లి మృతి
● వేగావతినదిలో మునిగి మరణించిన వివాహిత
బాడంగి: కడుపున పుట్టిన పిల్లలు నదిలో మునిగిపోతుండగా కాపాడిన ఓ తల్లి తాను ప్రవాహంలో కొట్టుకుపోయి బుధవారం మృతిచెందింది. ఈ దురదృష్టకర సంఘటనపై పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలంలోని ఆనవరం గ్రామానికి చెందిన అంపావల్లి సంతు(32) కార్తీకపౌర్ణమి ఉపవాసం ఉండి నోము నోచుకోవాలని పాప కీర్తి, బాబు చరణ్‌లతో కలిసి వేగావతి నదిలో స్నానం చేయడానికి వెళ్లింది. పిల్ల లు ఆడుకుంటూ నది లోతులోకి వెళ్లిపోతూ ప్రమాదంలో పడ్డారు. వారిని ఆదుకునే క్రమంలో ఆమె గోతిలో దిగి పిల్లలను కాపాడి.. తాను వరదప్రవాహంలో కొట్టుకుపోయింది. కొంత దూరంలో ఉన్న కారాడ పథకం వద్ద తేలగా బంధువులు, గ్రామస్తులు బయటకు తీశారు. వెంటనే ఆమెను చికిత్సకోసం బాడంగి సీహెచ్‌సీకి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం భద్రపరిచారు. తల్లిచనిపోయిందన్న సమాచారంతో పిల్లలిద్దరూ భోరుమని ఏడుస్తుండగా నాయనమ్మ వారిని సముదాయించేందుకు ఆపసోపాలు పడింది. మృతురాలి భర్త అనంత కుమార్ ఫిర్యాదుమేరకు హెచ్‌సీ ఉమామహేశ్వరరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కన్నపేగులను కాపాడి తల్లి మృతి
కన్నపేగులను కాపాడి తల్లి మృతి


