టెట్ అభ్యర్థులపై ఫీజు భారం
వీరఘట్టం: టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) పరీక్ష ఫీజుల పెంపుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఒకే సారి ఫీజును రూ.500 పెంచి రూ. 1000 చేయడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో వలే రూ.500 ఫీజుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ వైపు ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే.. పరీక్ష ఫీజు పేరుతో మరింత భారం వేయడం కూటమి ప్రభుత్వానికి తగదంటున్నారు. టెట్ పరీక్ష నిర్వహణకు అక్టోబర్ 24 నోటిఫికేషన్ వచ్చింది. దర ఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 23 చివరి తేదీ కాగా, హాల్ టికెట్లు డిసెంబర్ 3 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని, డిసెంబర్ 10 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే, గతేడాది 2024లో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి 55,500 మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేశారు. ఇప్పుడు ఇన్ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్ష రాయాల్సిందేనని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో నిరుద్యోగులతో పాటు ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మంది ఈ ఏడాది టెట్ పరీక్షక్షకు దరఖాస్తు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కొక్కరికి పరీక్ష ఫీజు రూ.1000 చొప్పున ఉమ్మడి జిల్లాల నుంచి టెట్ ద్వారా ప్రభుత్వానికి రూ.20 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇన్ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు పరీక్ష ఫీజును చెల్లించే అవకాశం ఉన్నా నిరుద్యోగ యువతపై పరీక్ష ఫీజుల రూపంలో భారం మోపడం పద్ధతి కాదని నిరుద్యోగులు అంటున్నారు.
ఇప్పటికే ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు టెట్ ఫీజు రూపంలో ఆర్థిక భారం వేయడం తగదు. ఫీజును గతేడాది మాదిరిగానే రూ.500లే తీసుకోవాలి. రూ.1000 ఫీజు చెల్లించడం నిరుద్యోగులకు భారం అవుతుంది.
– జె.అమర్‌నాథ్, పట్టభద్రుడు, వీరఘట్టం
టెట్ పరీక్షకు ఎటువంటి ఫీజులు లేకుండా నిర్వహించాలి. గత ఎన్నికల ముందు నిరుద్యోగ యు వతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కూట మి నాయకులు అధికారం వచ్చిన తర్వాత అరకొర టీచరు పోస్టులు తీసి టీచర్ అభ్యర్థులకు కుచ్చుటోపీ పెట్టారు. కనీసం టెట్ పరీక్షకు ఫీజులు మినహాయించి నిరుద్యోగ పట్టభద్రులపై ఆర్థిక భారం లేకుండా చూడాలి.
– ఉగిరి శ్రీనివాసరావు,
పట్టభద్రుడు
గతంలో టెట్ పరీక్ష ఫీజు రూ.500.. నేడు రూ.1000కు పెంపు
ఉమ్మడి జిల్లా అభ్యర్థులపై రూ.20కోట్ల భారం
ఆవేదనలో అభ్యర్థులు
టెట్ అభ్యర్థులపై ఫీజు భారం


