కార్మిక, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం
కార్మికులు, ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మన్యం జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.సింహాచలం, సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.వెంకటరమణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పురపాలక సంఘాలు, కార్పొరేషన్‌లలో ఉన్న కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుంటే పోరాటానికి సిద్ధం అవుతామని స్పష్టం చేశారు. పార్వతీపురం పట్టణంలో మున్సిపల్ కార్మికులతో కలిసి బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గం 12వ పీఆర్సీ కమిటీ కోసం ఎదురుచూస్తోందని చెప్పారు. ప్రభుత్వం అది ఇవ్వనప్పుడు ఐఆర్ ప్రకటించి కార్మికుల వేతనాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పురపాలక సంఘాల్లో మహిళా ఉద్యోగులకు నేటికీ ప్రసూతి సెలవు లేదని.. డ్యూటీలకు హాజరవుతున్న పాయింట్లలో కనీసం ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేలా నీరు, మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.


