పంటలు కాపాడుకోండిలా..
పార్వతీపురం/భామిని: మోంథా తుఫాన్ కారణంగా జరిగిన పంటనష్టాన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని కాపాడుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్, వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో పలు విషయాలు తెలియజేశారు. జిల్లాలోని 10 మండలాల్లో 1,591 ఎకరాలలో వరిపంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని, ఈ కారణంగా పంటకు కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొంటే నష్టం కొంతమేర తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
● పాలుపోసుకునే దశలో వరి పంట ఉంటే పొలంలో నీరు ఉంటే తక్షణం తొలగించాలి. గింజలు రంగు మారకుండా, మాగుడు, మానిపండు తెగుళ్ల నివారణకు ఎకరాకు 200 ఎంఎల్ ప్రోపికోనాజోల్ మందును పిచికారీ చేయాలని సూచించారు.
● వరి పంటలో మొలకలు కనబడితే లీటరు నీటిలో 50 గ్రాముల ఉప్పు కలిపి ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
● వరి పంటలో బాక్టీరియా ఎండాకు తెగులు కనిపిస్తే ఒక ఎంఎల్ ప్లాంటోమైసిన్, 2 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట పొలంలో నీరు తగ్గిన తరువాత 2 ఎంఎల్ హెక్సాకోనజోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని పేర్కొన్నారు.
సస్యరక్షణే ప్రధానం
వర్షాలు ఎక్కువగా కురిసేవేళ పంటల సస్యరక్షణ చర్యలే ప్రధానమని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
పత్తి పంటలో..
పత్తి చేనులో వర్షపునీరు లేకుండా చూడాలి. పూత, కాయ దశలోని పంటలో పైపాటుగా ఎకరానికి 30 కేజీల యూరియా, 15 కేజీల ఫొటాష్ వేయాలి. 2 శాతం యూరియా, లేదంటే పోటాషియం నైట్రేట్, ఒక శాతం మెగ్నీషియం సల్ఫేట్‌తో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
పత్తి పంటలో చేరిన నీటితొలగింపునకు సూచనలిస్తున్న వ్యవసాయాధికారి


