రక్షించండి
రక్త పిశాచాల నుంచి..
పార్వతీపురం రూరల్: జిల్లాలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు జ్వరాల బారిన పడి విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. మలేరియా, విషజ్వరాల కేసులు భయపెడుతుండగా, మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర(పీహెచ్‌సీ) వైద్యుల సమ్మె కారణంగా సరైన వైద్యం అందక గిరిజనులు అల్లాడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో, రక్తపిశాచాలైన దోమల నుంచి తమను, పిల్లలను కాపాడుకోవడానికి దోమతెరలైనా ఇవ్వండని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న తీరు పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వ్యాధుల కట్టడిలో, ప్రజారోగ్య పరిరక్షణలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనడానికి ఈ దుస్థితే నిలువెత్తు నిదర్శనం.
నిధుల మంజూరులో నిర్లక్ష్యం
ఏజెన్సీలో దోమల విజృంభణను అరికట్టేందుకు 4 లక్షల ‘లాంగ్ లాస్టింగ్ ఇన్‌సెక్టిసైడల్’ దోమతెరలు కావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏడాదిన్నర కిందటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి వాటిని రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. ఆ ప్రతిపాదనలు నేటికీ కాగితాలకే పరిమితం కావడం, ప్రజల ఆరోగ్యంపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లం చేస్తోంది. అధికారులు ఫైళ్లను ముందుకు కదపకపోవడం, పాలకులు ఒత్తిడి తేలేకపోవడంతో గిరిజనులు దోమలకు బలైపోతున్నారు.
కాలం చెల్లిన తెరలతో కరువైన రక్షణ
గతంలో ఎప్పుడో పంపిణీ చేసిన దోమతెరల కాలపరిమితి (4–5 ఏళ్లు) ఎప్పుడో తీరిపోయింది. అవి చిరిగిపోయి, వాటి ప్రభావం కోల్పోయి నిరుపయోగంగా మారాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా..ఒక్క దోమతెరనైనా పంపిణీ చేసిన పాపాన పోలేదు. దీంతో చిరిగిన తెరలతోనే కాలం వెళ్లదీస్తూ, మృత్యువుతో నిత్యం సహజీవనం చేయాల్సిన దయనీయ స్థితిలో గిరిజన ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు
జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. ఏకంగా 698 గ్రామాలు మలేరియా ప్రభావిత ప్రాంతాలుగా, అందులో 245గ్రామాలు (హైరిస్క్) జాబితాలో ఉన్నట్లు అధికారులే గుర్తించారు. 2024లో 4,08,725 రక్త నమూనాల్లో 2653 మలేరియా కేసులు, 88 హైరిస్క్ గ్రామాలు. కాగా ఈ ఏడాది 2025లో (ఇప్పటివరకు) 4,41,596 నమూనాల్లో 1916కేసులు నమోదు కాగా, గతేడాదికంటే హై రిస్క్ గ్రామాల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. వ్యాధి తీవ్రత పెరుగుతున్నా పాలకుల్లో చలనం లేకపోవడం గిరిజనుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికై నా ప్రభుత్వం కుంభకర్ణుడి నిద్ర వీడి, తక్షణమే 4 లక్షల దోమతెరలను యుద్ధప్రాతిపదికన మంజూరు చేయించి, వాటి వినియోగంపై అవగాహన కల్పించి తమ ప్రాణాలను కాపాడాలని గిరిజన ప్రజానీకం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది.
ప్రతిపాదనలు పంపించాం
జిల్లాకు కావాల్సిన 4.42 లక్షల దోమ తెరలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. డిసెంబర్ నాటికి వచ్చే అవకాశాలున్నాయి. వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం.
– వై.మణి. జిల్లా మలేరియా అధికారి
దోమ తెరలు ఇవ్వండి ప్లీజ్
గిరిజనుల వేడుకోలు
ప్రతిపాదనలకే పరిమితమవుతున్న దోమతెరల పంపిణీ
జిల్లాలో 698 మలేరియా ప్రభావిత గ్రామాలు
ఈ ఏడాదిలో 1916 మలేరియా
కేసులు, 245 హైరిస్క్ గ్రామాల గుర్తింపు
రక్షించండి
రక్షించండి


