
గిరిజన బిడ్డల బాగోగులు పట్టించుకోరా?
● మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర
మెంటాడ: విద్యార్థుల తల్లిదండ్రులు ఓట్లు మంత్రి సంధ్యారాణికి అవసరం... వారి పిల్లల బాగోగు లు, ఆరోగ్య పరిస్థితులు మాత్రం అవసరం ఉండదు... ఇదీ ఆమె తీరు అంటూ మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఎద్దేవా చేశారు. మండలంలోని కొండలింగాలవలసలో బీటీ రోడ్డు శంకుస్థాపనకు హాజరైన మంత్రి ‘విద్యార్థులకు జ్వరమొస్తే నాకేంటి సంబంధం.. అది నా బాధ్యతా’.. అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. గిరిజనుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవి చేపట్టారని, సమస్య లపై ప్రశ్నించిన వారికి సావధానంగా సమాధానం చెప్పాలే తప్ప బాధ్యత లేదని తప్పించుకోవడం సరికాదన్నారు. గిరిజన, విద్యార్థి సంఘాల డిమాండ్ మేరకు మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని కోరారు. ప్రతిపక్షనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు అందజేశారని, ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున పైసా కూడా ఇవ్వకపోవడం విచారకరమన్నారు. కేవలం పదవిని మాత్రమే అనుభవించాలని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారా అంటూ మంత్రి సంధ్యారాణిని ప్రశ్నించారు. హాస్టల్స్‌లో ఉన్న గిరిజన విద్యార్థులు మరణిస్తే ఆ బాధ్యత మీది, మీ ప్రభుత్వానిది కాదా అంటూ నిలదీశారు. గతంలో నూటికో కోటికో ఒకరు చనిపోయినప్పుడు ప్రభు త్వ హత్యలు అని గగ్గోలు పెట్టారు... ఇప్పుడు ఏడాదిన్నరలో ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే 15 మంది విద్యార్థులు చనిపోయారని, ఇవి ప్రభుత్వ హత్యలు కాదా అని ప్రశ్నించారు. ప్రతీ ఆశ్రమ పాఠశాలలకు ఏఎన్‌ఎంను నియమిస్తామన్న మొదటి సంతకం ఏమైందని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖ వచ్చి కేజీహెచ్‌కు వెళ్లి పరామర్శించేందుకు సమయం లేదుగానీ, క్రికెట్ మ్యాచ్ చూడడానికి మాత్రం సమయం ఉందా అని కూటమి ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు.