
మెగా వెంచర్‌లో హెచ్చరిక బోర్డులు
● ఇంటిప్లాన్, కరెంట్, తాగునీటి
సరఫరాకు అనుమతులు ఇవ్వం
● చిననడిపల్లి మెగా వెంచర్‌లో
హెచ్చరిక బోర్డులు
చీపురుపల్లి: ఎలాంటి అనుమతులు లేని మెగా వెంచర్‌లో జరుగుతున్న ప్లాట్ల విక్రయాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎట్టకేలకు పంచాయతీరాజ్ అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. భవిష్యత్‌లో మరెంతో మంది కొనుగోలుదారులు మోసపోకుండా ఉండేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. చీపురుపల్లి మండలంలోని చిననడిపల్లి పంచాయతీ పరిధిలో కనీస నిబంధనలు పాటించకుండా 69 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ మెగా వెంచర్ ఏర్పాటు చేయడంపై ‘సాక్షి’ పత్రికలో ‘రియల్‌గా మోసం’ శీర్షికన ఈ నెల 19న కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై అదే రోజు స్పందించిన ఎంపీడీఓ ఐ.సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది చిననడిపల్లి పంచాయతీ పరిధిలో అనుమతులు లేని లేఅవుట్‌ను సందర్శించి నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా మంగళవారం అదే మెగా వెంచర్‌లో ఎలాంటి అనుమతులు లేవంటూ హెచ్చరిక బోర్డులను డిప్యూటీ ఎంపీడీఓ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఏర్పాటు చేశారు. చిననడిపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌లు 73, 92, 93, 94లో అభివృద్ధి చేస్తున్న ఈ లేఅవుట్‌ను అనధికార లేఅవుట్‌గా గుర్తిస్తూ, ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని ఇంటి ప్లాన్లు పంచాయతీ నుంచి ఇవ్వబోమని, విద్యుత్, తాగునీటి సరఫరాకు కూడా ఎలాంటి పంచాయతీ అనుమతులు ఉండవని హెచ్చరిక బోర్డుల్లో స్పష్టం చేశారు.