ఘాట్ రోడ్‌లో గ్యాస్ లారీ బోల్తా
పాచిపెంట: మండలంలోని పి.కోనవలస జాతీయ రహదారి ఘాట్ రోడ్డుపై మంగళవారం మధ్యాహ్నం అదుపుతప్పిన గ్యాస్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి రాయగడ మీదుగా జార్ఖండ్ వెళ్లవలసిన గ్యాస్ లారీ, దారి తప్పి రామభద్రపురం నుంచి సాలూరు మీదుగా ఒడిశా రాష్ట్రం సుంకి వైపు వెళ్తుండగా, డ్రైవర్‌కు అనుమానం వచ్చి రూట్ కోసం పలువురు లారీ డ్రైవర్లను అడగడంతో వేరే రూట్ లో వెళ్లాలని తెలియజేశారు. దీంతో పద్మాపురం పంచాయతీ రొడ్డవలస సమీపంలో యూటర్న్ తీసుకుని సాలూరు వైపు వస్తుండగా లారీ అదుపుతప్పి సుమారు 100 అడుగుల లోయలో పడింది. విషయం తెలుసుకున్న ఫైర్ అధికారులు స్థానిక పోలీసుల పర్యవేక్షణలో ఆరు క్రేన్‌లతో లారీని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.


