
సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
● జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి
పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సమర్పించే అర్జీదారుల వినతులకు సత్వరమే పరిష్కారం చూపాలపి పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన అధ్యక్షతన జరిగిన పీజీఆర్‌ఎస్‌లో సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్‌ఓ కె.హేమలత, సబ్‌కలెక్టర్ ధర్మచంద్రారెడ్డిలు అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలలో కొమరాడ మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన ధాత్రిశ్రీ తల్లికి వందనం డబ్బులు జమకాలేదని, జిల్లా కేంద్రంలోని కొత్తవలసకు చెందిన రౌతు పారినాయుడుకు పింఛన్ మంజూరు చేయాలని, వెంకటసాగరం ఆయకట్టులో 40 ఎకరాలకు సక్రమంగా నీరు అందించాలని సీతానగరం మండలం అంకలాం రైతులు కోరారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులకు పరిష్కారం చూపండి
పార్వతీపురం రూరల్: ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధిత పోలీసుశాఖ అధికారులు జవాబుదారిగా వ్యవహరించి పరిష్కారం చూపాలని ఏఎస్పీ అంకితా సురానా అన్నారు. అలాగే నిర్దేశించిన సమయంలోనే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వచ్చిన 10 ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్‌నాయుడు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 42 అర్జీలు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 42 అర్జీలు వచ్చాయి. ముగడపేటకు చెందిన రమణమ్మ హౌసింగ్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి అందజేసింది. యోగా టీచర్ పోస్టు ఇప్పించాలని మండ గ్రామానికి చెందిన సవర శ్రీను, కొండపోడు పట్టాలు ఇప్పించాలని బంజారుపేట గిరిజనులు కోరారు. జీజీవలస గ్రామస్తులు శ్మశానవాటికకు సీసీ రోడ్డు, ప్రహరీని నిర్మించాలని వినతులు అందజేశారు. పెద్దగూడకు చెందిన సవర మంగయ్య బ్యాటరీ స్ప్రేయర్ ఇప్పించాలని, కమ్యూనిటీహాల్ మంజూరు చేయాలని కరడంగివలస గ్రామస్తులు కోరారు. పీజీఆర్‌ఎస్‌లో ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, డిప్యూటీఈవో రామ్మోహన్‌రావు, ఉపవైద్యాధికారి విజయపార్వతి, ఏపీడీ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి