
17న జిల్లా ఆస్పత్రిలో వైద్య శిబిరం
● జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి నాగభూషణరావు
పార్వతీపురంటౌన్: స్వస్థ నారీ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో వైద్యశిబిరం నిర్వహించనున్నట్టు జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి జి.నాగభూషణరావు సోమవారం తెలిపారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. జిల్లా ఆస్పత్రిలో నిర్వహించనున్న మెగా మెడికల్ క్యాంపులో మహిళలకు ఎన్‌సీడీల స్క్రీనింగ్ సేవలు అందిస్తామని తెలిపారు. రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, స్థన క్యాన్సర్, గర్భాశయ ముఖ క్యాన్సర్, క్షయవ్యాధి స్క్రీనింగ్, రక్తహీనత స్క్రీనింగ్‌లు ఉంటాయన్నారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మోక్షగుండంను ఆదర్శంగా తీసుకోవాలి
విజయనగరం అర్బన్: ఇంజినీర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ఇన్‌చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మి కోరారు. మోక్షగుండం జయంతిని పురస్కరించుకుని వర్సిటీలో సోమవారం ఇంజినీరిండ్ డేను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి వీసీ మాట్లాడుతూ ఇంజినీర్లు ప్రొఫెషనల్‌గానే కాకుండా సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనాలని కోరారు. దేశాభివృద్ధికి మోక్షగుండం చేసిన కృషిని కొనియాడారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బి.ఉమాశంకర్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో సివిల్ ఇంజినీర్ల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ జీజే నాగరాజు, సివిల్ విభాగాధిపతి డాక్టర్ జి.అప్పలనాయుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.జగన్‌మోహన్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న మొక్షగుండం నఖచిత్రం
గరుగుబిల్లి: మండలంలోని నాగూరుకు చెందిన నఖచిత్రకారుడు పల్ల పరిశినాయుడు ఇంజనీర్స్ డే సందర్భంగా వేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య నఖచిత్రం పలువురిని ఆకట్టుకొంది.
రేపటి నుంచి వాహన మిత్ర దరఖాస్తుల స్వీకరణ
● కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి
పార్వతీపురం రూరల్: వాహన మిత్ర పథకం కోసం బుధవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అక్టోబర్ 1న వాహనమిత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో సొంత ఆటో కలిగిన డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలానాలు ఉండరాదని, మూడెకరాల మాగాని, మెట్టభూమి అయితే పదెకరాల లోపు ఉండేవారు పథకానికి అర్హులని తెలిపారు.
నేరాల నియంత్రణే లక్ష్యం
● ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్
విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తామని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు.

17న జిల్లా ఆస్పత్రిలో వైద్య శిబిరం