
జూనియర్స్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
● 23 నుంచి ఎన్‌టీఆర్ జిల్లా
గొల్లపూడిలో పోటీలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్‌క్రీడామైదానం ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 120 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారు. బాల, బాలికల విభాగాల్లో నిర్వహించిన ఎంపికలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ ఎంపికల్లో బాలుర విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులు, బాలికల విభాగంలో మెరుగైన ఆట తీరు కనబరిచిన 14 మంది క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 23 నుంచి 26వరకు ఎన్‌టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరగనున్న అంతర్ జిల్లాల జూనియర్స్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కేవీ.ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావులు తెలిపారు. ఎంపిక పోటీలను అసోసియేషన్ కోశాధికారి బి.శివప్రసాద్, ప్రధానోపాధ్యాయులు నగేష్‌కుమార్, కొవ్వాడ శేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు తౌడుబాబు, గోపాల్, మీసాల.శ్రీనివాసరావు, మజ్జి తిరుపతిరావు, సారిపల్లి గౌరీశంకర్, సౌదామిని, పి.ఆదినారాయణలు పర్యవేక్షించారు.