
రేపటి నుంచి స్వస్థ్ నారీ సశక్త్‌పరివార్ అభియాన్
● జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఈనెల 17వ తేదీ బుధవారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం జరగనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన బ్యానర్లు, పోస్టర్లను సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, వీఆర్‌ఓ హేమలత, ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, డీఎంహెచ్‌ఓ డా.ఎస్.భాస్కరరావు, డీసీహెచ్‌ఎస్ డా.జి. నాగభూషణరావు, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి జగన్‌మోహన్‌రావు లతో కలిసి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పారామెడికల్ సిబ్బంది ద్వారా ప్రత్యేక వైద్య శిబిరాలు వైద్య నిపుణులతో నిర్వహించనున్నందున అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు, గర్భిణులు, బాలింతలు ఈ శిబిరాలకు తీసుకురావాలని ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ, ఆశవర్కర్లు మాత్రమే కాకుండా జిల్లా, మండల గ్రామస్థాయిలో వైద్యశాఖ, మహిళా శిశుసంక్షేమశాఖతోపాటు స్థానిక ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది మహిళలకు అవగాహన కల్పించి వైద్య శిబిరాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, మరికొంతమంది జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.