
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
● కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి
పార్వతీపురం టౌన్: ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిసరాలను, వార్డులను పరిశీలించి వైద్యాధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలను జారీ చేశారు. ఆసుపత్రి పరిసరాలు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని రోగులు, బాలింతలతో మాట్లాడిన కలెక్టర్ వైద్య సేవలు, ఉచిత మందుల పంపిణీ, సమస్యలపై ఆరా తీశారు. కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి వార్డులను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. రోగులతో పాటు సహాయకులకు కూడా భోజనం ఏర్పాటు చేయాలని, ఇందుకు ఆసుపత్రిలోనే ఒక క్యాంటీన్ పెట్టేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పడకలతో పాటు అదనపు పడకలను పెంచడానికి, పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ పనులు నిర్ణీత సమయానికి ముందే పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యపై వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ సిజేరియన్ల సంఖ్యను తగ్గించి, సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు. సిజేరియన్ రేటు ఎక్కువగా ఉన్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డీసీహెచ్‌ఎస్, డీఎంహెచ్‌వోలను కలెక్టర్ ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి..
షెడ్యూలు కులాల సంక్షేమ బాలికల వసతిగృహాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్కడి విద్యార్థినులతో ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, విద్యను అందించాలని ఆదేశించారు. ఎల్లవేళల వసతిగృహ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, వారికి రక్తహీనత లేకుండా చూడాలని అన్నారు. పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్.భాస్కరరావు, డీసీహెచ్‌ఎస్ నాగభూషణరావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా. ఎం.వినోద్ కుమార్, ఆసుపత్రి పర్యవేక్షకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి