
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం
విజయనగరం లీగల్: రాజీయే రాజ మార్గమని కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహ పూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకై క మార్గం లోక్ అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎం.బబిత అన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్‌లను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్ వలన కక్షిదారులకు సమయంతో పాటు డబ్బు వృథా కాకూడదన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో పలు సివిల్, క్రిమినల్ కేసులు, రాజీ పడదగిన కేసులను రాజీ మార్గంలో ఇరు పార్టీల సమ్మతితో శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్ ఉమ్మడి జిల్లాలైన విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లోని విజయనగరం పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో మొత్తంగా 6852 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. వాటిలో సివిల్ కేసులు 280, క్రిమినల్ కేసులు 6505, ప్రీ లిటిగేషన్ కేసులు 67 పరిష్కరించినట్టు తెలిపారు. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 37 లక్షల 50 వేల రూపాయలు మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, ఫ్యామిలీ కోర్ట్ జడ్జి కె.విజయ కళ్యాణి, బి.అప్పలస్వామి, నాలుగవ శ్రేణి న్యాయమూర్తి, ఎన్.పద్మావతి, మహిళా మరియు ఐదవ జిల్లా న్యాయమూర్తి కె.నాగమణి, ఫోక్స్ న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయమూర్తి ఎ.కృష్ణప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కోర్ట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, పోలీస్, ఇన్సూరెన్సు అధికారులు, బ్యాంకు మేనేజర్లు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, ఎక్కువ సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు.

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం