
ద్విచక్రవాహనాల నుంచి పెట్రోల్ చోరీ
పార్వతీపురం రూరల్: రాత్రివేళ ఇళ్ల వెలుపల వీధుల్లో ఉంచే ద్విచక్ర వాహనాల నుంచి గుర్తుతెలియని దుండగులు పెట్రోలు దోచేస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనదారులు వెలుపల తమ వాహనాలను ఉంచేందుకు భయాందోళన చెందుతున్నారు. గురువారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని కొత్తవలస ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న వెంకట్రావు అనే వ్యక్తి షాపు, ఇంటి ముందు ఉంచిన ద్విచక్రవాహనాల నుంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి రాత్రి 1:40 గంటల సమయంలో పెట్రోలును గుట్టుచప్పుడు కాకుండా సేకరిస్తున్న దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. శుక్రవారం ఉదయం బయటకు వెళ్లేందుకు వాహనాన్ని తీసే క్రమంలో పెట్రోల్ దొంగిలించినట్లు అనుమానంతో సీసీ కెమెరాలు పరిశీలించి తెలుసుకున్నట్లు తెలిపారు. అలాగే కొత్తవలస పరిసరప్రాంతాల్లో ఇదే తరహాలో ద్విచక్ర వాహనాలనుంచి పెట్రోల్ దొంగిలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తమ వీధుల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు పలువురు వాపోతున్నారు.
సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు