
కొలిక్కి వచ్చిన భూ సమస్య
వీరఘట్టం/జియ్యమ్మవలస రూరల్: మండలంలోని చినగోర రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 17లో ఉన్న 20 ఎకరాల భూ సమస్యకు శుక్రవారం రెవెన్యూ, పోలీస్ అధికారులు శాశ్వత పరిష్కారం చూపారు. ఆక్రమణకు గురైన సుమారు 20 ఎకరాల భూమి వీరఘట్టం మండలం చినగోర రెవెన్యూ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సర్వే నంబర్ 17లో ఉన్న 151 ఎకరాల భూమిని 18 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం వీరఘట్టం మండలం సంతనర్సిపురంలో ఉన్న భూమిలేని పేదలకు ఎకరా చొప్పున కేటాయించింది. అందరికీ డీ పట్టాలు ఇచ్చింది. అయితే, భూమి అప్పగించలేదు. చినగోర రెవెన్యూ గ్రామానికి పక్కనే ఉన్న జియ్యమ్మమవలస మండలం గడసింగుపురం, ఏనుగులగూడకు చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమిలో సుమారు 20 ఎకరాలను కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. ఈ భూమిపై హక్కు కల్పించాలని జియ్యమ్మవలస మండలాలనికి చెందిన వారు కూడా అధికారులపై ఒత్తిడిచేశారు. ఈ క్రమంలో సంత–నర్శిపురం లబ్ధిదారులకు, భూములు సాగు చేస్తున్న జియ్యమ్మవలస మండలానికి చెందిన వారికి కొన్నేళ్లుగా తగాదాలు జరుగుతున్నాయి. పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. ఆ భూమిని వీరఘట్టం, జియ్యమ్మవలస మండలాల తహసీల్దార్లు ఎ.ఎస్.కామేశ్వరరావు వై.జయలక్ష్మి, సర్వే అధికారులు చినమేరంగి సీఐ టి.తిరుపతిరావు, వీరఘట్టం, జియ్యమ్మవలస ఎస్‌ఐలు జి.కళాధర్, ప్రశాంత్‌కుమార్‌ల సమక్షంలో పరిశీలించారు. ప్రస్తుతం జియ్యమ్మవలస మండలం వారు సాగుచేస్తున్న 20 ఎకరాల భూములు వీరఘట్టం మండలంలో ఉన్నట్లు గుర్తించారు. సోమవారం నాటికి ఈ భూములను లబ్ధిదారులకు అప్పగిస్తామని స్పష్టంచేశారు.