
సర్వేల భారం!
పార్వతీపురం టౌన్: ప్రభుత్వం మారింది. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ సేవల్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బండెడు చాకిరీ చేయాల్సిన పరిస్థితి ఉందంటూ సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ఇటు శాఖాపరమైన విధులు, అటు సచివాలయ విధులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని, వివిధ రకాల ప్రభుత్వ సర్వేలతో సతమతం అవుతున్నామంటూ వాపోతున్నారు. అధిక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
వివక్ష తగదు...
సచివాలయ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందన్నది సంఘ నాయకుల వాదన. ఏడాదిన్నరలో ప్రభుత్వ పరిధిలో కొందరు సీనియర్ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా వివక్ష చూపుతున్నారు. గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఎక్కడ ఏ పని ఉన్నా సచివాలయ ఉద్యోగులకే అప్పగిస్తున్నారు. పండగలు, సెలవుల సమయంలో కూడా వివిధ సర్వేల పేరుతో ఒత్తిడికి గురిచేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శికి కార్యదర్శి విధులతో పాటు ఇతర అనుబంధ ఉద్యోగులైన వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, వీఆర్‌ఓ, మహిళా పోలీస్‌లకు వారి శాఖాపరమైన విధులతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలు, సర్వేలు, ప్రభుత్వ కార్యక్రమాల పనులను అప్పగిస్తున్నారు. ఈ పనులతో తీవ్ర గందరగోళం, ఒత్తిడికి గురవుతున్నామని, మరోవైపు స్పెషల్ ఇంక్రిమెంట్లు, పదోన్నతులు వంటి డిమాండ్లను పరిష్కరించడం లేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
సచివాలయ ఉద్యోగులు సర్వేలకు స్వచ్ఛందంగానే హాజరవుతున్నారు. ఉద్యోగులు ఇబ్బందులకు గురికాకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేలకు పంపుతున్నాం.
– రామచంద్రరావు, జీఎస్‌డబ్ల్యూఎస్ జిల్లా అధికారి పార్వతీపురం మన్యం
పని ఒత్తిడితో సతమతం
నిర్ధిష్టమైన జాబ్‌చార్ట్ లేకపోవడంతో ఇబ్బందులు
మాతృశాఖలో చేర్చాలంటున్న ఉద్యోగులు
ఇంక్రిమెంట్లు లేకపోవడంతో ఆందోళన
పీ–4 సర్వే చేయలేమంటూ నిరసన

సర్వేల భారం!