
సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్
సాలూరు:ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సంపూర్ణంగా అమలుచేయకుండా మరోసారి ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో గురువారం మాట్లాడారు. 50 ఏళ్ల వయస్సు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు ఇస్తామని ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. పింఛన్ తీసుకున్న భర్త చనిపోతే భార్యకు స్పౌజ్ పింఛన్ ఇస్తున్నారే తప్ప కొత్త పింఛన్ ఒక్కటి కూడా మంజూరు చేయకపోవడం విచారకరమన్నారు. కూటమి పాలనా వైఫల్యానికి ఇదొక నిదర్శనమన్నారు. అరకొర బస్సులు ఉండడం వల్ల ఉచిత బస్సు పథకం మహిళలకు అక్కరకు రాలేదన్నారు. వైఎస్సార్‌సీపీ పోరుబాటతోనే సీ్త్రశక్తి పథకాన్ని అమలుచేశారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి సుమారు కోటి 50లక్షల మందిని మోసం చేశారన్నారు. రాష్ట్రంలో 8లక్షల ఉద్యోగాలంటూ యాడ్‌లు ఇస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఆడబిడ్డ నిఽధి ఇచ్చారా?
18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారన్నారు. సుమారు కోటి 50 లక్షల మందికి ఆడబిడ్డ నిధి అందజేయకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఆటో, ట్యాక్సీ, లారి డ్రైవర్లకు కూడా వాహనమిత్ర కింద రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇంతవరకు లబ్ధిచేకూర్చలేదని విమర్శించారు. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు పూర్తిస్థాయిలో అమలుకాలేదని, ఇప్పటికీ చాలామంది లబ్ధిదారులు పథక లబ్ధికోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ మోసపూరిత పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధిచెబుతారన్నారు.
ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలుచేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు
నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి హామీల అమలు ఊసేలేదు
కనీసం రైతుకు కావాల్సిన యూరియా అందించలేని దుస్థితి
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర