
16 నుంచి రామతీర్థంలో పవిత్రోత్సవాలు
నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 16 నుంచి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని దేవస్థాన ఈవో వై.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పవిత్రోత్సవాలకు అంకురారోపణం చేస్తామన్నారు. 17న మంగళాశాసనం, తీర్థ గోష్ఠి, యాగశాలలో ప్రత్యేక హోమాలు జరుగుతాయన్నారు. అదే రోజు మధ్యాహ్నం అకల్మష హోమాలు, పవిత్ర శుద్ధి ఉంటుందని, 18న పారయణాలు, జపములు, హవనాలు, అష్టకలశ స్నపన మహోత్సవం జరిపించి శ్రీరామచంద్రస్వామికి అర్చకులు పవిత్ర సమర్పణ చేస్తారన్నారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు.
ప్రారంభమైన కళా ఉత్సవ్ పోటీలు
నెల్లిమర్ల: స్థానిక వేణుగోపాలపురంలో ప్రభుత్వ డైట్ కళాశాలలో కళా ఉత్సవ్–2025 జిల్లా స్థాయి పోటీలు గురువారం సందడిగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలిరోజు నృత్యం, గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం తదితర అంశాలపై వ్యక్తిగత, బృంద పోటీలు నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన ప్రిన్సిపాల్ కె.రామకృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి వున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కళాఉత్సవ్ పోటీలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. కా ర్యక్రమంలో శ్రీనివాసరావు,ఉ త్సవాల నోడల్ అధికారి వి.చిన్నంనాయుడు, అధ్యాపకులు కాళ్ల అప్పారావు, సూరిబాబు, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, మురళి తదితరులు పాల్గొన్నారు.
● పీఎంపీ వైద్యుడి నిర్వాకం
● ఆందోళనకు దిగిన బంధువులు
భామిని: మండలంలోని ఘనసర గ్రామానికి చెందిన కిల్లారి తేజాలు(58) కొత్తూరుకు చెందిన శ్రీసాయి ప్రజావైద్యశాలలో వైద్యానికి వెళ్లి మృతి చెందింది. తేజాలు మృతికి పీఎంపీ వైద్యుడు వై.నాగేశ్వరరావు నిర్లక్ష్యమే కారణమని బంధువులు ప్రజా వైద్యశాల ముందు ఆందోళనకు దిగారు. చివరకు కొత్తూరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు మృతురాలి బంధువులకు నచ్చజెప్పి మృతదేహాన్ని తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఘనసర గ్రామానికి చెందిన తేజాలు కాళ్లు, చేతులు పీకుతున్నాయని భర్త తవిటినాయుడుతో కలిసి కొత్తూరులోని శ్రీసాయి ప్రజా వైద్యశాలకు గురువారం వెళ్లింది. అక్కడ పీఎంపీ వైద్యుడు నాగేశ్వరరావు రెండు ఇంజక్షన్లు వేసే సమయానికి తేజాలు అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందిందని భర్త తెలిపాడు. విషయం తెలుసుకున్న తేజాలు బంధులు ప్రజా వైద్యశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కొత్తూరు ఎస్‌ఐ అక్కడకు చేరుకొని మృతురాలి బంధువులను శాంతింపజేశారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాతపట్నం ఆసుపత్రికి తరలించారు.

16 నుంచి రామతీర్థంలో పవిత్రోత్సవాలు

16 నుంచి రామతీర్థంలో పవిత్రోత్సవాలు