
నిర్బంధాలతో పోరాటాలను ఆపలేరు
● మాజీ ఎమ్మెల్యే కళావతి
వీరఘట్టం: నిర్బంధాలతో వైఎస్సార్‌సీపీ పోరాటాలను ఆపలేరని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లనీయకుండా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు పోలీసులు గృహనిర్బంధం చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. రైతుల కోసం వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటాన్ని కూటమి ప్రభుత్వం భగ్నంచేయాలని చూడడం వారి అవివేకమన్నారు. ప్రజాపోరాటాలతో కూటమి ప్రభుత్వం త్వరలో కనుమరుగవ్వడం ఖాయమన్నారు.
ఎరువుల పంపిణీ పరిశీలన
వీరఘట్టం: స్థానిక మార్కెట్ యార్డులో యూరియా పంపిణీని ఏడీఏ రత్నకుమారి, ఏఓ సౌజన్యతో కలిసి జిల్లా వ్యవసాయశాఖాధికారి రాబర్ట్‌పాల్ మంగళవారం పరిశీలించారు. రైతులకు అవసరమైన ఎరువును త్వరలో సమకూర్చుతామని తెలిపారు. ముందుగా వరి పంట సాగు చేసే రైతులకు యూరి యా పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాకు 22,500 టన్నుల యూరియా అవసరంకాగా, ఇంత వరకు 16,303 టన్నులు తెచ్చామని, ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలు, ప్రైవేటు డీలర్ల ద్వారా 15,478 టన్నుల యూరియా సరఫరా చేసినట్టు వెల్లడించారు.
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
కురుపాం: ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని, సాగు పద్ధతులపై గిరిజన రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ రైతులకు పిలుపునిచ్చారు. కురుపాం మండలంలోని ఉదయపురం గ్రామాన్ని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మంగళవారం సందర్శించారు. అక్కడి గిరిజన రైతులతో మాట్లాడారు. అధిక మోతాదులో ఎరువుల వినియోగం వల్ల పంటకు, ఆరోగ్యానికి హానికరమన్నారు. యూరియా వినియోగానికి బదులుగా నానో, ఇతర జీవన ఎరువులను వినియోగంచుకోవాలన్నారు. అనంతరం రైతులకు నానో యూరి యా, డీఏపీని పంపిణీ చేశారు.
టీచర్‌గా కలెక్టర్..
ఉదయపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టి కాహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, హెచ్‌ఐవీ, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.వినోద్‌కుమార్, ప్రత్యేక ఉప కలెక్టర్ డాక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.జగదీశ్వరరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
వంగర: మండలంలోని సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వరస్వామిని కేరళకు చెందిన రామానందభారతిస్వామి మంగళవారం దర్శించుకున్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గర్భగుడిలో చేరిన నీటిని ఇంజిన్ల సాయంతో తోడించారు. అనంతరం స్వామీజీ పూజలు జరిపారు. ఆయన వెంట అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ, ప్రధాన అర్చకుడు సిద్ధాంతం గణపతిశర్మ ఉన్నారు.