
ఒక్క బస్తా ఇస్తే ఒట్టు..
వీరఘట్టం: వీరఘట్టంలోని మన గ్రోమోర్ సెంటర్ కు వచ్చిన 400 బస్తాల యూరియాను సోమవారం పంపిణీ చేస్తామని వ్యవసాయాధికారులు ప్రకటించారు. దీనికోసం సచివాలయం–4 వద్ద టోకెన్లు ఇస్తామని చెప్పారు. ఈ సమాచారంతో పెద్దఎత్తున రైతులు సచివాలయం వద్దకు చేరుకున్నారు. స్థలం ఇరుకుగా ఉండడం, వందలాది మంది రైతులు చేరుకోవడంతో తోపులాట జరిగింది. వ్యవసాయాధికారులు టోకెన్ల పంపిణీని నిలిపివేస్తూ సచివాలయం తలుపులు బలవంతంగా యూసేయడంతో తలుపుల మధ్యన సన్యాసిరావు అనే రైతు చేతివేళ్లు ఉండిపోయి నలిగిపోయాయి. ఆయనను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. తర్వాత మార్కెట్‌యార్డు వద్ద టోకెన్ల పంపిణీని ప్రారంభించినా రైతులను కంట్రోల్ చేయలేక మంగళవారం పంపిణీ చేస్తామని ప్రకటించి ఏఓ సౌజన్యతో పాటు పోలీసులు వెళ్లిపోయారు. ఉదయం నుంచి ఒక్క బస్తా ఎరువు కూడా పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. కూటమి ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు.