
పైడితల్లి ఆలయంలో సమస్యల కొలువు
హుండీలకు రక్షణ అంతంత మాత్రమే.. వర్షం కురిస్తే ఆలయమంతా నీరే.. శిథిలావస్థలో ఆలయ ప్రహరీ పండగ సమీపిస్తున్నా మరమ్మతుల పనులు శూన్యం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 12 నుంచి పందిరిరాట, మండల దీక్షలతో ప్రారంభంకానున్నాయి. చదురుగుడి అభివృద్ధి కోసం ఇరువైపులా ఉన్న షాపులను పూర్తిగా నేలమట్టం చేయడంతో గత కొన్నాళ్లుగా ఆలయ గోడలు శిథిలావస్థకు చేరాయి. వర్షం కురిస్తే కారిపోతోంది. ఆలయమంతా నీటితో నిండిపోతోంది. అసలే చిన్న ఆలయం కావడంతో పక్కన రేకులను కప్పి మమ అనిపించేశారు. వర్షం కురిసినప్పుడు ప్రధాన ఆలయం కారిపోతుండడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్న ఆలయానికి తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేని స్థితిలో అధికారులున్నారా ? అని ప్రశ్నిస్తున్నారు. పండగ పూట వర్షం కురిస్తే కారిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆలయానికి పటిష్టమైన భద్రత లేకపోవడం వల్ల ఎప్పుడు ఏ చోరీ జరుగుతుందోనన్న భయం అటు సిబ్బంది, ఇటు భక్తుల్లో నెలకొంది. ఇదే విషయంపై ఆలయ ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష స్పందిస్తూ ఉత్సవాల తర్వాత ఆలయ అభివృద్ధి పనులు చేపడతామన్నారు.