
రాళ్లదారిలో 4 కిలోమీటర్లు..
కొమరాడ: మండలంలోని పాలెం పంచాయతీ పరిధి కుస్తూరు గ్రామానికి చెందిన తాడింగి సురేష్ సోమవారం త్రీవ అస్వస్థతకు గురయ్యాడు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో కుటుంబ సభ్యులు డోలీలో రాళ్ల దారిలో 4 కిలోమీటర్ల దూరంలోని పూజారి గూడ గ్రామం వరకు తీసుకొచ్చి ఆటోలో కురుపాం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధిని విస్మరించిందని, రోడ్ల సదుపాయం కల్పనకు కనీస చర్యలు తీసుకోవడంలేదని గిరిజన సంఘాల నాయకులు మండిపడ్డారు. తరచూ డోలీ కష్టాలు ఎదురవుతున్నా పట్టించుకోవడంలేదంటూ వాపోయారు. తక్షణమే గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే జగదీశ్వరి స్పందించి కుస్తూరు గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని కోరారు.