
చర్చలకు రానప్పుడు అసత్య ఆరోపణలు ఎందుకు?
● టీడీపీ నాయకులపై గిరిజన
ప్రజా ప్రతినిధుల మండిపాటు
పాచిపెంట: అభివృద్ధిపై చర్చలకు రానప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు ఎందుకు చేస్తారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన ప్రజా ప్రతినిధులు సోములు లచ్చయ్య, మాదల సింహాచలం, డోనేరు లచ్చయ్యలు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, సభలు సమావేశాలు, ప్రచార మాధ్యమాలలో గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధిని విస్మరించిందని, ఒక్క అభివద్ధి పని కూడా చేయలేదని మాట్లాడుతున్నారన్నారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా చర్చకు రావాలని సవాల్ విసరగా, కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ సవాల్ స్వీకరించి, మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు చర్చకు వస్తామని తెలియజేశారన్నారు. అయితే తాము చర్చ ప్రదేశానికి వెళ్లగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ రాలేదన్నారు, స్వయంగా మేమే మళ్లీ వారికి ఫోన్ చేసి మాట్లాడగా శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు వస్తానని తెలియజేశారని శనివారం కూడా రాలేదన్నారు. చర్చించే ధైర్యం లేనప్పుడు సవాళ్లు ఎందుకు స్వీకరిస్తారని ఎందుకు అసత్యఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఎప్పుడైనా అభివృద్ధిపై చర్చకు వస్తామంటే తాము ఎప్పుడూ ఆధారాలతో సిద్ధంగా ఉంటామని పత్రికా ముఖంగా మరోసారి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేశారు.