
నమస్తే కార్యక్రమంపై అవగాహన పెంపొందించుకోవాలి
సాలూరు: చెత్త, ఇతర కుప్పల్లో దొరికే ప్లాస్టిక్, ఐరన్ వంటి వాటిని ఏరుకునే కార్మికులకు లబ్ధిచేకూర్చేందుకు ప్రవేశపెట్టిన నమస్తే (నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) కార్యక్రమంపై అవగాహన పెంపొందించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రత్నకుమార్ తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని స్క్రాప్ షాపుల యజమానులతో బుధవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కొందరు కార్మికులు చెత్త, ఇతర కుప్పల్లో దొరికే ప్లాస్టిక్,ఐరన్ వంటి వాటిని ఏరుకుని స్క్రాప్ షాపులకు వచ్చి విక్రయించి జీవనం సాగిస్తుంటారని, అటువంటి వారికి యాంత్రిక పద్ధతులపై శిక్షణ ఇచ్చి వారికి మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని వివరించారు. షాపులకు వచ్చి వాటిని అమ్మే కార్మికుల వివరాలను మున్సిపల్ కార్యాలయానికి అందించాలని సూచించారు. తద్వారా వారికి ఎంతో సాయం చేసిన వారవుతారని అన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.