
వ్యాధులపై అవగాహన కల్పించేందుకే కళాజాతా
పార్వతీపురం: గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధుల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు కళాజాతాను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం స్థానిక ఐటీడీఏ కార్యాలయం ప్రాంగణంలో కళాజాతా ప్రదర్శన తీరును ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జ్వరాలపై జాగ్రత్తలు, అందుబాటులో ఉన్న వైద్యసేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాతాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. గిరిజన గ్రామాల్లో షెడ్యూల్ వారీగా ప్రదర్శన చేయాలని కోరారు. కళాజాతాపై గ్రామాల్లో ముందు రోజు తెలియజేయాలని సూచించారు. వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ పి.మురళీధర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.కేవీఎస్.పద్మావతి, డీఐఓ డా.జగన్‌మోహన్‌రావు, ట్రైబల్ వెల్‌ఫేర్ డీడీ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.