
అనాథ వృద్ధురాలికి సేవలు
విజయనగరం అర్బన్: ఈ నెల 12వ తేదీన సాక్షి దినపత్రికలో ‘అమ్మ రోడ్డున పడింది’ శీర్షికన వచ్చిన వార్త మరికొంత మందిని కదిలించింది. తొలి రోజున కొందరు స్పందించి శుభ్రమైన నీటితో ఆమెకు స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింప చేసి షెల్టర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆ వృద్ధురాలికి ప్రతి రోజూ కొందరు దయార్ద్ర హృదయులు మానవత్వంతో సేవలు అందిస్తున్నారు. సమీపంలోని ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్టీసీ తదితర శాఖల ఉద్యోగులు అబ్రహం పీటర్ పాల్, వెంకాయమ్మ, రాగిణి, గీతి తదితరులు మేము సైతం అంటూ చేయి చేయి కలిపి సేవలు చేస్తున్నారు. వృద్ధురాలి కాలు, శరీరంపై పుండ్లను శుభ్రం చేయడం, స్నానం చేయించడం, కొత్త వస్త్రాలు ధరించేలా చేయడం, ఆహారం, మందులు అందించడం వంటి పనులు చేస్తున్నారు. ఈ నిస్వార్థ సేవలు నిజమైన సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సాక్షి కథనానికి స్పందించిన దయార్ద్ర హృదయులు

అనాథ వృద్ధురాలికి సేవలు