
చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి
విజయనగరం: విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరించి పని చేసేచోట గుర్తింపు పొందాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హితవు పలికారు. ఈ మేరకు జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్‌లో పలువురికి కారుణ్య, పదోన్నతుల నియామక పత్రాలను శుక్రవారం అందజేశారు. ఇందులో భాగంగా వేపాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేవలందిస్తూ మరణించిన బయాలజీ ఉపాధ్యాయుడు డి.కన్నయ్య కుమారుడు సింహాచలానికి వియ్యంపేట జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో సహయకుడిగా కారుణ్య నియామకపత్రాన్ని అందజేశారు. అదేవిధంగా మెరకముడిదాం మండల పరిషత్ కార్యాలయంలో సహాయకుడిగా పని చేస్తున్న టి.రాములుకు మెరకముడిదాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ల్యాబ్ అసిస్టెంట్‌గా, బలిజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వీపర్‌గా పని చేస్తున్న జి.ప్రమీలకు పాల్తేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రికార్డ్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పిస్తూ నియామకపత్రాలు అందజేశారు. విజయనగరం మండల పరిషత్ కార్యాలయంలో సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుకు పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రికార్డ్ అసిస్టెంట్‌గా నియామకం పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ బీవీవీ.సత్యనారాయణ పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు