
నీ వెంటే నేను..!
● మరణంలోనూ వీడని దంపతుల బంధం
● భర్త మృతిచెందిన కొద్ది సమయానికే భార్య మృతి
కొమరాడ/పార్వతీపురం రూరల్: నాతిచరామి..అన్న పెళ్లినాటి ప్రమాణానికి కట్టుబడి ఉన్నారా దంపతులు. వివాహం అయినప్పటి నుంచి ఒకరికొకరు తోడుగా అన్యోన్యంగా ఉంటూ జీవనం సాగించారు. వృద్ధాప్యం వచ్చినప్పటికీ వారిలో అన్యోన్యత ఏ మాత్రం తగ్గలేదు. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కలిసి జీవనం సాగిస్తున్న ఆ దంపతులు మరణంలోనూ వారి బంధాన్ని వీడలేదు. భర్త మరణ వార్త విన్న భార్య భావోద్వేగానికి లోనై కొద్ది క్షణాల్లోనే మరణించింది. ఈ ఘటన కొమరాడ మండలంలోని కళ్లికోట గ్రామంలో జరిగింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సీర పకీరునాయుడు (80), సీర పోలమ్మ (75) దంపతులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల పకీరునాయుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడక గురువారం మధ్యాహ్నం మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య భావోద్వేగానికి గురై సాయంత్రం మృతిచెందింది. భార్యాభర్తలు ఒకే రోజు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

నీ వెంటే నేను..!