
జనసేన నాయకుడి దౌర్జన్యం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని మొయిద నారాయణపట్నం గ్రామంలో జనసేన మండల అధ్యక్షుడు పతివాడ అచ్చిం నాయుడు ఓ రైతు కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు, ఎస్సై గణేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అచ్చింనాయుడు, సామంతుల రమణల మధ్య కొంతకాలంగా పొలం గట్టు విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేత అచ్చింనాయుడు మంగళవారం ఉదయం రమణ పొలాన్ని ఆక్రమించి గట్టు వేశాడు. ఇదే విషయమై రమణ ప్రశ్నించగా విచక్షణా రహితంగా దాడి చేయడంతో సామంతుల రమణతో పాటు చనమల్లు అరుణ్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వారిద్దరూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. తమ వారిని గాయపరచడంతో అదే రోజు సాయంత్రం గ్రామంలో ఇరువర్గాల మధ్య మళ్లీ ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో అచ్చింనాయుడితో పాటు అవతలి వర్గంలోని పలువురికి గాయాలయ్యాయి.
తనపైనే దాడి అంటూ జనసేన నేత ప్రచారం
తొలుత రైతు కుటుంబాన్ని గాయపరిచిన జనసేన నేత అచ్చింనాయుడు అదేమీ లేదంటూ తనపైనే దాడి చేశారని రాజకీయ కోణంలో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశాడు. పోలీసులు వాస్తవాలను తెలుసుకోవడంతో సైలెంట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి గ్రామాన్ని సందర్శించి తగాదాపై ఆరా తీశారు. ఇది కేవలం పొలంలో తలెత్తిన గొడవేనని..రాజకీయానికి సంబంధం లేదని ఆమె గుర్తించారు. తమపై దాడి జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు బాధిత వర్గం ఎమ్మెల్యేకు వివరించింది. దాడి జరిగినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, అన్యాయం జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందని బాధిత వర్గాన్ని ఎమ్మెల్యే మందలించారు. పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు.
పొలం గట్టును కలిపేసి ఆపై రైతుపై దాడి
ప్రతిఘటించిన బాధిత రైతు కుటుంబం
ఇరు వర్గాలకు గాయాలు, ఆస్పత్రిలో చికిత్స
ఆరాతీసిన ఎమ్మెల్యే లోకం నాగమాధవి’

జనసేన నాయకుడి దౌర్జన్యం