
విజయనగరం ఆర్టీసీ డిపో సందర్శన
విజయనగరం అర్బన్: ఆర్టీసీ ఎం,డి ద్వారకా తిరుమలరావు బుధవారం విజయనగరం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ఆర్టీసీ డిస్పెన్సరీని మార్చడానికి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి, దాని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశారు. లాజిస్టిక్ కౌంటర్‌లను సందర్శించి బస్‌స్టేషన్‌కు వెళ్లి విద్యార్ధులతో బస్సుల సమయపాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన డిపో సిబ్బందితో సమావేశమై వారి పనితీరును మెచ్చుకున్నారు. అంతేకాక విజయనగరం డిపో పరిధిలో ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉత్తమ సేవలందించిన సిబ్బందిని ప్రోత్సహించడం ద్వారా వారి కృషిని గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే నెల 15 నుంచి మహిళలకు కల్పించే ఉచిత బస్సు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు, ప్రస్తుతం నడుపుతున్న బస్సులను కూడా ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రయాణికుల సౌకర్యార్థం పల్లెవెలుగు బస్సులను పెంచుతామన్నారు. మహిళా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.బ్రహ్మానందరెడ్డి, విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు, డిప్యూటీ సీటీఎం జి.సత్యనారాయణ, డిప్యూటీ సీఎంఈ కొటాన శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా ప్రజా రవాణా అధికారిణి జి.వరలక్ష్మి, ఈఈ అరుణకుమార్, డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు, సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ దుర్గాప్రసాద్, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.