
విద్యను జాతీయం చేయాలి
పార్వతీపురం రూరల్: ఆటంబాంబులు, సునామీల కంటే పేపర్ లీక్ సమాజానికి, వ్యవస్థకు ఎంతో హానికరం అని పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఈ మేరకు బుధవారం పార్వతీపురం వచ్చిన ఆయన ఆగస్టు 22న విడుదల కానున్న తన ‘యూనివర్సిటీ పేపర్ లీకేజ్’ చిత్రం ప్రమోషన్ మేరకు జిల్లా కేంద్రంలోని పలువురు రాజకీయ నాయకులను పట్టణ ప్రముఖులను కలిశారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా విద్యారంగంలో జరుగుతున్న పేపర్‌లీక్ వల్ల జరిగే నష్టాలను చర్చిస్తూ తాను యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. గ్రూప్ 1, 2 పరీక్షల్లో అలాగే పలు ప్రధాన పరీక్షల్లో ప్రశ్నపత్రాల్ని లీక్ చేయడం చూస్తుంటే విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలు ఏమైపోతాయో అనే భయం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాపీయింగ్ చేసి మార్కులు తెచ్చుకున్న వారు డాక్టర్లు అయితే రోగుల ప్రాణాలకు భరోసా ఉండదని, అలాంటి వాళ్లు ఇంజనీర్లు అయితే బ్రిడ్జిలు ఎలా నిలబడతాయని ఆర్.నారాయణమూర్తి ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలు జరగకూడదంటే పేపర్ల లీక్‌లను అరికట్టాలని, విద్యను జాతీయం చేసి ప్రైవేట్ మాఫియా నుంచి విముక్తి చేయాలని ఆయన కోరారు.
పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి