సరిహద్దులు దాటించేసి! | - | Sakshi
Sakshi News home page

సరిహద్దులు దాటించేసి!

Jul 16 2025 3:49 AM | Updated on Jul 16 2025 3:49 AM

సరిహద

సరిహద్దులు దాటించేసి!

ఆగని గంజాయి అక్రమ రవాణా

పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసినా వెరవని వైనం

వ్యసనం బారిన యువత

ఆవేదనలో తల్లిదండ్రులు

సాక్షి, పార్వతీపురం మన్యం:

● విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మానాపురం రైల్వే గేటు వద్ద పోలీసులు, ఈగల్‌ బృందం ఈ నెల 13న వాహన తనిఖీలు చేపడతుండగా.. రెండు కార్లలో 230 కిలోల గంజాయి లభ్యమైంది. ఒడిశా రాష్ట్రం పొట్టంగి నుంచి పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారయ్యారు.

● కొద్దిరోజుల క్రితం విజయనగరం పట్టణ పరిధిలోని అయ్యన్నపేట వద్ద మూడు కిలోల గంజాయితో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రం రాయగడ వద్ద మరో వ్యక్తి నుంచి అతను గంజాయి కొనుగోలు చేసి, సేవించడంతోపాటు.. విజయనగరంలో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.

● గత మే నెలలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని దుగ్ధసాగరం వద్ద 184 కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. కారుతోపాటు గంజాయిని సీజ్‌ చేశారు.

● గత ఏప్రిల్‌ నెలలో ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి తమిళనాడు రాష్ట్రానికి సుమారు 44 కిలోల గంజాయిని కారులో రవాణా చేస్తుండగా.. పార్వతీపురం పట్టణం వద్ద పోలీసులు పట్టుకున్నారు.

● కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒడిశా నుంచి గంజాయి తరలిస్తుండగా.. పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం సిమిలిగూడకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి వీరు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.

సులువుగా రవాణా

పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఎటుచూసినా ఒడిశా సరిహద్దులే ఉండటం.. చుట్టూ ప్రాంతమంతా కొండ కోనలే కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి సరిహద్దు వెంబడి గంజాయి సులువుగా ప్రవేశిస్తోంది. అక్రమార్కులు వివిధ మార్గాలను అన్వేషించడంతోపాటు.. స్థానిక గిరిజన యువతకూ డబ్బులు, విలువైన వస్తువులు ఆశ చూపించి గంజాయిని ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సరిహద్దులు దాటించేస్తున్నారు. జిల్లా మీదుగానే ఒడిశా, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గంజాయిని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఒడిశాను ఆనుకుని పి.కోనవలస, కూనేరు, బత్తిలి, గుణుపూర్‌ వద్ద అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం ఉండటం లేదు. సాలూరు మండలంలో పెద్దగా తనిఖీలు ఉండటం లేదు. పాచిపెంట మండలం సుంకి వద్ద నుంచి ఎక్కువగా ద్విచక్ర, ఇతర వాహనాలు మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఒక వాహనాన్ని.. ఆర్మీకి చెందిన వాహనంలా తయారు చేసి మరీ గంజాయి తరలించడం గమనార్హం. ఇటీవల సరిహద్దును దాటుకొని ద్విచక్ర వాహనంపై వస్తున్న భార్యాభర్తలను తనిఖీ చేయగా.. వారి బ్యాగులో గంజాయి లభ్యమైంది. ఇవి కొన్ని ఘటనలు మాత్రమే.

తరచూ దొరుకుతున్నా..

పార్వతీపురం మన్యం జిల్లాలో 25 గంజాయి అనుమానిత ప్రదేశాలను పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 11 కేసులు నమోదు కాగా.. 1,87.225 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 12 వాహనాలు సీజ్‌ చేశారు. 21 మందిని అరెస్టు చేశారు. ఉమ్మడి జిల్లాలో గత ఏడాది 70 కేసులు నమోదు కాగా.. 240 మందిని అరెస్టు చేశారు. 1,750 కిలోల వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 40 వరకు కేసులు నమోదయ్యాయి. తరచూ కేసులు నమోదవుతున్నా.. వినియోగం, రవాణా మాత్రం తగ్గడం లేదు. అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నా.. కళ్లుగప్పి, కనికట్టు చేస్తున్నారు.

గంజాయి కేసులో ఆరుగురు యువకులను కొద్దిరోజుల క్రితం విజయనగరం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన యువకులు ఒక ప్రాంతంలో చదువుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడి.. వారి అవసరాల కోసం ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి.. చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గంజాయి వినియోగం, రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో ఈ ఘటన ఒక ఉదాహరణ. చెంతనే ఒడిశా రాష్ట్రం కావడం.. రవాణా మార్గాలు అధికంగా ఉండటం వల్ల అక్కడ నుంచి గంజాయి సులువుగా జిల్లాలోకి ప్రవేశిస్తోంది. అధిక శాతం మంది యువత ఈ వ్యసనం బారిన పడగా.. వీలైనంత డబ్బుల సంపాదనకు కూడా ఇది అనువుగా భావిస్తున్నారు. ఒడిశా నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో మన్యం, విజయగరం జిల్లాల మీదుగా విశాఖ, ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలిపోతోంది.

సరిహద్దులు దాటించేసి! 1
1/1

సరిహద్దులు దాటించేసి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement