
ఖరీఫ్ గట్టెక్కేదెలా?
సాగునీటి పంపిణీ సక్రమంగా జరిగేలా చూస్తాం
ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో పాలకొండ డివిజిన్ పరిదిలోని ఏఈలు బదిలీపై వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఏఈ ఒక్కరే ఉన్నారు. పాత ఆయకట్టులోని కుడి, ఎడమ కాలువల్లో లష్కర్ల కొరత ఉంది. సాగునీటి పంపిణీ సక్రమంగా చేపట్టేందుకు లష్కర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఈ ఏడాది సాగునీటి పంపిణీ సక్రమంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపడతాం.
– వై.గన్నిరాజు, డీఈ, పాలకొండ
వీరఘట్టం: అధికారంలోకి వస్తే తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనులు వేగవంతంగా పూర్తిచేసి సాగునీటి కష్టాలు తీర్చుతామని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువల ఆధునికీకరణ పనులు రద్దు చేసి రైతులకు వెన్నుపోటు పొడిచారు. ఓ వైపు పూడికలు, జంగిల్‌తో ఆధ్వానంగా ఉన్న కాలువలు, మరోవైపు జలవనరులశాఖలో సిబ్బంది కొరత సాగునీటి నిర్వహణకు శాపంగా మారాయి. పాత ఆయకట్టు శివారు భూములకు సాగునీరందే పరిస్థితి కనిపించడంలేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బుధవారం పాత ఆయకట్టు కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేసేందుకు జలవనరులశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇంజినీరింగ్ అధికారుల కొరత...
పాలకొండ జలవనరుల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం పరిధిలోని పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం జిల్లా వంగర మండలాలు ఉన్నాయి. పాలకొండ సెక్షన్–1, సెక్షన్–2లో పనిచేస్తున్న ఏఈలు ఇటీవల బదిలీపై వెళ్లారు. ఆ స్థానాల్లో ఎవరినీ నియమించకపోవడంతో ఈ ఖాళీల్లో వీరఘట్టం ఏఈ డి.వి.రమణ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇతర మండలాలకు కూడా ఆయనే దిక్కు. ప్రస్తుతం ఖరీఫ్ ఆరంభం కావడంతో ఆరు మండలాలను ఒక్కరే చూడడం సాధ్యం కాని పరిస్థిఇ. ఏటా నీటి విడుదల సమయంలో ఎడమ కాలువలో 1వ బ్రాంచ్ ఎగువన పూనులు వేసి నీటిని మళ్లిస్తున్నారు. దీనివల్ల పాలకొండ శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ ఏడాది కూడా సాగునీరు శివారు భూములకు వస్తుందా...రాదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
లష్కర్ల కొరత....
తోటపల్లి పాత ఆయకట్టులోని కుడి, ఎడమ కాలువల నుంచి 64 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కాలువల నిర్వహణ, నీటి పంపిణీని 36 మంది లష్కర్లు పర్యవేక్షించాల్సి ఉండగా ఇక్కడ కేవలం ఏడుగురు లష్కర్లు మాత్రమే ఉన్నారు. కాలువల్లోని ఎగువ ప్రాంతాల్లో అడ్డుకట్టలు, బ్రాంచ్ కాలువలకు నీటి మళ్లింపుపై చర్యలు చేపట్టాల్సి ఉండగా లష్కర్ల కొరతతో ఆ పనులు జరగడం లేదు. శివారు ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదు.
శివారు ఆయకుట్టుకు నీరందెనా?
తోటపల్లి పాత ఆయకట్టులో విపత్కర పరిస్థితి
సాగునీటి పంపిణీకి పర్యవేక్షణ కరువు
ఆరు మండలాలకు ఒక్కరే ఏఈ
లష్కర్ల కొరత
నేడు తోటపల్లి పాత ఆయకట్టుకు సాగునీరు విడుదల

ఖరీఫ్ గట్టెక్కేదెలా?